Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, సినిమా కంటెంట్ విషయంలో వచ్చిన విమర్శలను మేకర్స్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని మరింత మెరుగుపరచే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. హీరోయిన్ను చూపించిన తీరు, కొన్ని షాట్లపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ ఆ సన్నివేశాలను తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లలో ఆ మార్పులతో కూడిన వెర్షన్ ప్రదర్శితమవుతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’లో మార్పులు అక్కడితో ఆగలేదని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ నిడివి, కథనం వేగంపై ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఎడిటింగ్ మార్పులు చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను తగ్గించి, వాటి స్థానంలో రామ్ చరణ్ మరియు జగపతి బాబు పాత్రల మధ్య భావోద్వేగపూరిత సన్నివేశాలను జోడించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఈ మార్పులతో కథ మరింత బలంగా, భావోద్వేగంగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారట. అలాగే సినిమాలోని కొన్ని నెమ్మదిగా సాగిన భాగాలను కత్తిరించి, కథనాన్ని మరింత రేసీగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టిని నిలబెట్టేలా సెకండాఫ్‌ను మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఎడిటింగ్ పనులు పూర్తయిన తర్వాత చిత్రానికి మళ్లీ సెన్సార్ అనుమతి తీసుకుని, కొత్త వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా, ముఖ్యంగా వచ్చే వీకెండ్‌కు ముందే ఈ అప్డేటెడ్ వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, మిశ్రమ టాక్ వచ్చినప్పటికీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఈ కొత్త మార్పులు సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తాయా? కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.