Tollywood | టాలీవుడ్లో ఆసక్తిపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొచ్చింది. ఈ కాలంలో టాలీవుడ్ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. “రిటర్న్ గిఫ్ట్” అంటూ వ్యాఖ్యలు చేస్తూ తన అసహనాన్ని బహిర్గతం చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు వంటి వారు పవన్ సూచనలను సానుకూలంగా తీసుకున్నారు.
దిల్ రాజు అయితే, “పవన్ గారు నాకు అన్నలాంటివారు. ఆయన చెప్పినదాన్ని పరిశీలించకుండా ఉండలేం” అని పేర్కొన్నారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలవాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరారు టాలీవుడ్ సినీ ప్రముఖులు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అప్పాయింట్ మెంట్ కోరినట్టు సమాచారం. దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు ఏపీ సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు పరిశ్రమ నుంచి పెద్దలుగా తమ సమస్యలను చంద్రబాబుకు వివరించనున్నారు.
చంద్రబాబును కలిసే ప్రక్రియకు పవన్ కళ్యాణ్ సారధ్యం వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా సినిమా నిర్మాణం, ప్రదర్శనకు సంబంధించిన విధానాలు, పన్నుల అంశాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల నియంత్రణ వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా థియేటర్లపై తీసుకున్న కొన్ని నిర్ణయాలు పవన్ కళ్యాణ్‌కి నచ్చకపోవడంతో, సినీ రంగంపై నేరుగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో అల్లు అరవింద్, దిల్ రాజు వంటి నిర్మాతలు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము ఎవరికి ఉందని కామెంట్ చేశారు. ఏది ఏమైన ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు చంద్రబాబుతో భేటి
కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.