Cinema Theatres | టాలీవుడ్ నిర్మాత నాగవంశీ లెనిన్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా చేసిన టికెట్ ధరల వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ.. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి అధిక టికెట్ ధరలు కారణమా, లేక లోపల అమ్మే పాప్‌కార్న్, వాటర్ బాటిల్స్ వంటి తినుబండారాల రేట్లు కారణమా అనేదానిపై సర్వే చేయాలంటూ ఆయన పేర్కొన్నారు. జనాలు టికెట్ ధరల గురించి పట్టించుకోట్లేదని థియేటర్ లోపల ఉన్న పాప్‌కార్న్ ధరల వలనే ప్రేక్షకులు సినిమాలకు రాలేకపోతున్నారని కామెంట్లు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన రావడమే కాకుండా ఈ విషయంలో నాగవంశీ విమర్శించడం మొదలుపెట్టారు.
పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని మరీ టికెట్ రేట్లు పెంచడం వల్ల, ఒక మధ్యతరగతి కుటుంబం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం అనేది భారంగా మారిందని ప్రేక్షకులు వాపోతున్నారు. థియేటర్లో ఫుడ్ కొనాలా వద్దా అనేది తమ ఇష్టమని, కానీ సినిమా చూడాలంటే టికెట్ తప్పనిసరి కాబట్టి ముందుగా టికెట్ ధరలను అదుపులోకి తేవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో మల్టీప్లెక్సుల్లో లభించే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలు బయట కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉండటం కూడా థియేటర్ అనుభవాన్ని మరింత ఖరీదైనదిగా మారుస్తోంది. ఈ మితిమీరిన ఖర్చుల వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు వెళ్లకుండా, కొన్ని వారాలు ఓపిక పట్టి ఓటీటీల్లోనే సినిమాలను చూసేందుకు మొగ్గు చూపుతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు టికెట్ల ద్వారా వచ్చే లాభాల్లో సింహభాగం నిర్మాతలు, పంపిణీదారులకే వెళ్తుందని, కేవలం థియేటర్ నిర్వహణ, సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లుల కోసమే తాము ఫుడ్ అండ్ బెవరేజెస్ అమ్మకాలపై ఆధారపడాల్సి వస్తోందని వారు సమర్థించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ, ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు రప్పించాలంటే కేవలం టికెట్ ధరలు లేదా కేవలం ఫుడ్ రేట్లు మాత్రమే కాకుండా, సినిమా చూసే మొత్తం వ్యయాన్ని తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమ, థియేటర్ యాజమాన్యాల పై ఎంతైనా ఉందని నెటిజన్లు చెప్పుకోచ్చారు.