OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. రాజకీయ నాయకుడిగానే కాకుండా సినీ హీరోగా కూడా మాస్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘OG (Original Gangster)’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభిమాని చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. చౌటుప్పల్‌లో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నిర్వహించిన OG బెనిఫిట్ షో మొదటి టికెట్ వేలంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఈ వేలంలో 15 మంది అభిమానులు పాల్గొనగా, చివరికి ఈ టికెట్ ఏకంగా రూ. 1,29,999 కు అమ్ముడుపోయింది. ఈ టికెట్‌ను అముదాల పరమేష్ అనే వీరాభిమాని గెలుచుకున్నారు.
ఈ వేలంలో టికెట్‌ను గెలుచుకున్న పరమేష్‌కు ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ నటుడు వినోద్ ప్రత్యేకంగా అందజేశారు. అభిమానుల అభిమానం, వారి తపన చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ .. “OG సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టనున్నారు. నా అభిమానాన్ని ఈ టికెట్ రూపంలో చాటుకోగలగడం గర్వంగా ఉంది” అన్నారు. మొదటి టికెట్‌కు చెల్లించిన మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా అందజేస్తానని పరమేష్ ప్రకటించారు. అభిమానాన్ని మంచి పనికి మలచిన విధానం చూసి కొందరు పరమేష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సంఘటన వైరల్‌గా మారింది.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన OG సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్, ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించగా, సంగీతం ఎస్.ఎస్. తమన్ అందిస్తున్నారు.ఈ టికెట్ వేలం ద్వారా అభిమానులు చూపిన మద్దతు చూసి సినీ పరిశ్రమలో OGపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఫ్యాన్స్ అందరు “OG బ్లాక్ బస్టర్ ఫిక్స్! అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు