Thug Life | యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం “థగ్ లైఫ్”. త్రిష కథానాయికగా, నటుడు శింబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంకి థియేటర్లలో మాత్రం ఆశించిన స్పందన రాకపోవడంతో మొదటి రోజు నుంచే ప్లాప్ టాక్‌ను ఎదుర్కొంది. దీనితో ఈ సినిమా త్వరగా ఓటీటీకి వస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు అవి నిజమయ్యాయి. “థగ్ లైఫ్” చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటిటీలో ముందుగానే విడుదల చేసింది. మొదట హిందీ వెర్షన్ ఆలస్యంగా రానుందని వార్తలు రాగా, అదే సమయంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని రిలీజ్‌కి ముందే భారీ ధరకి కొనుగోలు చేసింది నెట్‌ఫ్లిక్స్. సినిమాని థియేటర్స్‌లో విడుదలైన ఎనిమిది వారాలకి స్ట్రీమింగ్ చేసేలా డీల్ మాట్లాడుకున్నారు. కాని ఇప్పుడు చిత్రానికి నెగెటివ్ టాక్ రావడంతో నాలుగువారాలలోనే స్ట్రీమ్ చేస్తున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషలలో ఇప్పుడు థగ్ లైఫ్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. కర్ణాటకలో ఈ చిత్రం బ్యాన్ కాగా, అక్కడి అభిమానులు మూవీని చూడలేకపోయారు. ఓటీటీ ద్వారా వారికి చూసే అవకాశం ఇప్పుడు దక్కింది.
ఇక ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమైంది. మణిరత్నం – కమల్ హాసన్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌కు తగ్గ కథ, ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం వలన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కమల్, మణిరత్నం, రెహమాన్ లాంటి దిగ్గజాలు కలిసి రూపొందించిన సినిమా కావడంతో ఓటీటీ వేదికగా ప్రేక్షకులు ఈ సినిమాని మరింత ఆసక్తితో వీక్షించే అవకాశం ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ మూవీ అందుబాటులోకి రావడంతో, థియేటర్లో మిస్ అయిన వారు నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.