త్రినాథ్ కఠారి హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ఉపశీర్షిక. సాహితీ అవాంచ కథానాయిక. బళ్లారి శంకర్ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘ఈ సినిమాకు కథే హీరో. ఇది ఒక తండ్రీ కొడుకుల కథ. తండ్రీ కూతుళ్ల కథ. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కథ.
ఈ మూడు బంధాల మధ్య సాగే ప్రేమకథ ఇది. ఇందులో నేను ‘ఎదవ’ అనే ఒక క్యారెక్టర్ చేశాను. అందరం కష్టపడ్డాం. అందరూ నన్ను ప్రోత్సహించారు. వందశాతం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం’ అని హీరో, దర్శకుడు త్రినాథ్ కఠారి నమ్మకం వ్యక్తం చేశారు.
బాపూగారి సినిమాకు సంగీతాన్ని అందించలేకపోయానని, ఈ సినిమాతో నాకు ఆ అనుభూతి కలిగిందని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. నిర్మాతగా తన తొలి సినిమా ఇదని, అందరి సహకారంతో అద్భుతంగా వచ్చిందని నిర్మాత బళ్లారి శంకర్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా నటులు దేవిప్రసాద్, గోపరాజు రమణ, తాగుబోతు రమేశ్, డీవోపీ జగదీశ్ తదితరులు కూడా మాట్లాడారు.