Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి జోరుమీదున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొకటి రెడీగా పెడుతున్నారు. భోళా శంకర్ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాలు ఇప్పటికే ఫైనల్ అయ్యాయి. యూవీ క్రియేషన్ నిర్మాణంలో ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు చిరు. దీని తర్వాత మెగాడాటర్ సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా వుంటుంది. దీనికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తారు. మొదట ఒక కథ అనుకున్నారు. ఐతే కథలో కొన్ని మార్పులు జరిగాయి. ఎలాంటి మార్పులు జరిగినప్పటికీ ఈ కాంబినేషన్ పక్కాగా వుంటుందని తెలుస్తుంది.
ఈ రెండు సినిమాల తర్వాత కూడా మెగాస్టార్ లైన్ క్లియర్ గా వుంది. ఓ ముగ్గురు మెగా నిర్మాతలు చిరంజీవితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా ఓ మెగా ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే నిర్మాత దిల్ రాజు కూడా చిరంజీవితో ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారు. ఇక ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న నిర్మాత డీవీవీ దానయ్య కూడా చిరంజీవితో ఓ భారీ సినిమాకి ఏర్పాట్లు చేస్తున్నారు. తివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా వుండే అవకాశం వుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూడు భారీ ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపుదిద్దుకునే అవకాశం వుంది.