పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ (1998) చిత్రం ప్రేమకథా చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 30న 4కే వెర్షన్లో రీరిలీజ్ చేయబోతున్నారు. శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘డిస్ట్రిబ్యూటర్‌గా నా ప్రయాణం మొదలైన తొలినాళ్లలో చిత్ర నిర్మాత జీవీజీ రాజును కలిసి ఈ సినిమా పంపిణీ హక్కుల్ని పొందాను. నిర్మాతగా ఎన్ని అద్భుతమైన సినిమాలు తీసినా ‘తొలిప్రేమ’ చిత్రానికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. సినిమా ప్రివ్యూ నుంచి వందరోజుల వేడుక వరకు ప్రతీది గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది’ అన్నారు.