‘చిన్నప్పట్నుంచీ సాహిత్యాభిమానిని. చదవడం, రాయడం ఇష్టం. దర్శకుడు కావడం నా కల. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా చేశా. ఆ తర్వాత ‘భాగమతి’ దర్శకుడు అశోక్ దగ్గర, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ దర్శకుడు అరుణ్ పవార్ దగ్గర పనిచేశా. లాక్డౌన్ టైమ్‌లో ఖాళీ దొరికింది. ‘కలి’ స్క్రిప్ట్ రాశా. హీరో ప్రిన్స్‌కి వినిపిస్తే బావుంది చేద్దాం అన్నారు. నిర్మాత గౌతమ్‌వర్మ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. అలా ‘కలి’ మొదలైంది. ’ అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు శివ శేషు. ఆయన దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’. ప్రిన్స్, నరేష్ ఆగస్త్య హీరోలు. రుద్ర క్రియేషన్స్ పతాకంపై లీలా గౌతమ్‌వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు దర్శకుడు శివ శేషు. ‘ఈ సినిమా ప్రీప్రొడక్షన్కి ఏడాదిన్నర కేటాయించాం. ఇది ఒకే లొకేషన్లో జరిగే కథ కావడంతో ఫిల్మ్‌సిటీలో సెట్ వేశాం. ఈ సినిమాకు పనిచేసినవారంతా యంగ్ బ్యాచ్. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని చెప్పే కథ ఇది. ఇందులో ప్రిన్స్ శివరామ్ అనే కేరక్టర్ చేశాడు. మంచివాడు, మృదుస్వభావి అయిన శివరామ్ సమస్యల్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఇంతలో అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి వస్తాడు. ఆ కేరక్టరే నరేష్ ఆగస్త్య చేశాడు. అతనొచ్చాక శివరామ్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయ్? అనేదే ఈ సినిమా కథ. ఇది రెండు పాత్రల మధ్య నడిచే స్క్రిప్ట్. ఇద్దరూ అద్భుతంగా నటించారు. పురాణాల్లో కలి పురుషుడి పాత్రను ప్రేరణగా తీసుకొని రాసుకున్న కథ ఇది’ అని తెలిపారు శివ శేషు.