‘నా చిన్ననాటి సంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా చేశాను. నేను చూసిన మనుషులు, వారి భావోద్వేగాలు, చిన్నప్పటి అనుభవాలు ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇది నా ఊరి కథ. ఆ మాటకొస్తే ప్రతి ఊరికథ’ అన్నారు దర్శకుడు వి.మునిరాజు. ఆయన దర్శకత్వంలో రూపొందిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ పీరియడ్ డ్రామా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటించారు. సుమైనా స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 17న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు వి.మునిరాజు సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘40ఏండ్లు పై పడిన వారికి ఈ టీవీ అనుభవాలు బాగా తెలుసు. ఊరి మనుషులు, వారిమధ్య అహం వంటి అంశాలను చూపిస్తూ చివరిలో మంచి ఎమోషన్‌తో ఎండ్ చేశాం. ఈ తరం జెన్ జీ కిడ్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే అప్పటి కల్చర్ వీళ్లకు కొత్తగా ఉంటుంది. ప్రారంభం నుంచి చివరి వరకూ తర్వాత ఏం జరుగుతుంది? అని సీట్ ఎడ్జ్‌లో ఉండి చూస్తారు.
రాయలసీమ కుప్పం దగ్గరలోని తిమ్మరాజుపల్లి మా ఊరు. నిజంగా రియల్ లొకేషన్స్‌లోనే సినిమా తీశాను’ అని తెలిపారు మునిరాజు. కిరణ్ అబ్బవరం లాంటి నిర్మాత దొరకడం తమ టీం అదృష్టమని, ఇంత చిన్న సినిమాకు ఇంతమంచి రిలీజ్ ఇస్తున్నారని, కిరణ్ నమ్మకాన్ని నిలబెట్టేందుకు బాధ్యతగా సినిమాను తెరకెక్కించానని, హీరోహీరోయిన్స్ నుంచి ప్రతి ఆర్టిస్టు నటనా సహజంగా ఉంటుందని, ఇందులో ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉంటుందని, సాంకేతికంగా కూడా సినిమా ఆకట్టుకుంటుందని మునిరాజు పేర్కొన్నారు.