Maa Inti Bangaaram | స్టార్ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల మార్క్‌ను అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సినిమా సాధిస్తున్న ఈ అద్భుత విజయంపై సమంత భర్త, నిర్మాత రాజ్ నిడిమోరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
సమంత స్టార్ పవర్‌ను చాలా మంది తక్కువగా అంచనా వేశారని రాజ్ అన్నారు. సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం ఇండస్ట్రీలోని ఒక ప్రముఖ వ్యక్తిని కలిసిందని రాజ్ గుర్తు చేసుకున్నారు. ‘మా ఇంటి బంగారం’ పై పబ్లిక్ టాక్ ఎలా ఉందని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం తమను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. అయినా మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై ఎలాంటి అంచనాలు ఉండవు. థియేటర్లోకి వచ్చాక సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే చూడరు అని ఆ వ్యక్తి వ్యాఖ్యానించినట్లు రాజ్ తెలిపారు. ఆ మాటలు విన్నప్పుడు చాలా కఠినంగా అనిపించినా అదే నిజమేమో అనిపించిందని అన్నారు. అయితే మొదటి రోజు వసూళ్లు వచ్చిన తర్వాత తమ అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని రాజ్ వెల్లడించారు. థియేటర్లకు ప్రేక్షకులను భారీగా రప్పించే సామర్థ్యం సమంతకు ఉందని ఈ ఓపెనింగ్స్ మరోసారి నిరూపించాయని ఆయన అన్నారు. మహిళా ప్రధాన చిత్రమైనా కంటెంట్ బాగుండి, స్టార్ పవర్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించవచ్చని ‘మా ఇంటి బంగారం’ విజయం చాటిచెప్పిందని రాజ్ నిడిమోరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు, రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.