Tollywood | ఒక్కోసారి అంతే.. టైమ్ బ్యాడ్ ఏం చేయలేం.. అన్నీ మనకే వచ్చి చుట్టుకుంటూ ఉంటాయి. 2023లో ముగ్గురు హీరోల విషయంలో ఇదే జరిగింది. ముగ్గురు పెద్ద హీరోలే.. వరస సినిమాలు చేస్తున్న సమయంలో వాళ్ల కాలికి సర్జరీలు జరిగాయి. దాంతో ఉన్నఫళంగా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. జోరుగా వెళ్తున్న కెరీర్‌కు బ్రేకులు వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. వాళ్లే చిరంజీవి, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్. వాళ్ల వాళ్ల భాషల్లో ఈ ముగ్గురు సూపర్ స్టార్లు. తెలుగులో చిరంజీవి గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఇక ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో.. పృథ్వీరాజ్ కూడా మలయాళంలో సూపర్ స్టార్. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తూ సూపర్ బిజీగా ఉన్న వీళ్లకు 2023లో అనుకోని బ్రేకులు పడిపోయాయి. ఎప్పట్నుంచో వేధిస్తున్న గాయాలు ఈ ఏడాది తిరగబెట్టాయి.
ప్రభాస్‌కు బాహుబలి టైమ్ నుంచి గాయాలు వెంబడిస్తూనే ఉన్నాయి. అప్పుడు చేసిన యాక్షన్ స్టంట్స్ తాలూకు ప్రభావం ఇప్పటికీ మోస్తున్నాడు రెబల్ స్టార్. అప్పట్లో భుజం సర్జరీ చేయించుకున్న ఈయన.. మొన్నీమధ్యే లండన్ వెళ్లి కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. త్వరలోనే ఇండియాకు రానున్నాడు ప్రభాస్. వచ్చీ రాగానే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కానున్నాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్, మారుతి సినిమాలతో బిజీగా ఉన్నాడీయన. దాంతో పాటు హను, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు కథలు పట్టుకుని ప్రభాస్ కోసం వేచి చూస్తున్నారు. ఇక చిరంజీవి కూడా ఏడాదికి రెండు సినిమాలు అని ఫిక్సైపోయిన వేళ.. కాలి నొప్పి సడన్ బ్రేకులు వేసింది.
సైరా సమయంలో చిరు చేసిన స్టంట్స్ కారణంగా మోకాలి నొప్పి మొదలైంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది.. తాజాగా నొప్పి ఎక్కువైపోవడంతో సర్జరీ చేయించుకున్నాడు చిరు. ప్రస్తుతం ఈయన రెస్ట్‌లోనే ఉన్నాడు. డిసెంబర్ నుంచి వశిష్ట సినిమాలో జాయిన్ కానున్నాడు మెగాస్టార్. మరోవైపు పృథ్వీరాజ్ సుకుమారన్ కాలికి కూడా పెద్ద సర్జరీనే జరిగింది. ఈయన నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు ఆ మధ్య. అది చూసి అభిమానులు షాక్ అయ్యారు. తాజాగా కోలుకున్న ఈయన.. త్వరలోనే మళ్లీ సెట్స్‌కు రానున్నాడు. ఓ వైపు నటుడుగా బిజీగా ఉంటూనే.. మరోవైపు దర్శకుడిగా లూసీఫర్ 2ను అనౌన్స్ చేశాడు. మొత్తానికి ఈ ముగ్గురు స్టార్ హీరోలకు 2023 అంతగా కలిసిరాలేదు.. మరి వచ్చే ఏడాదైనా వీళ్లు పూర్తి ఆరోగ్యంగా ఉంటారని ఆశిద్దాం!