బాలీవుడ్ ఇండస్ట్రీలో కరణ్‌జోహార్, కంగనారనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత కరణ్‌జోహార్ లక్ష్యంగా కంగనారనౌత్ అనేక విమర్శలు చేసింది. కరణ్‌జోహార్ బాలీవుడ్‌పై గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నాడని పలు ఇంటర్వ్యూలో కంగనారనౌత్ ఆరోపించింది. వీరిద్దరి మధ్య శత్రుత్వం గత మూడేళ్లుగా అలాగే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కంగనారనౌత్ నటిస్తున్న ‘ఎమర్జెన్సీ’ చిత్రం గురించి ఇటీవల కరణ్‌జోహార్ పాజిటివ్‌గా మాట్లాడటం బాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరచింది.
ఇందిరాగాంధీ హయాంలో దేశవ్యాప్తంగా విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని కరణ్‌జోహార్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ఆయన మాటలపై వ్యంగ్యంగా తన స్పందన వ్యక్తం చేసింది కంగనారనౌత్. “మణికర్ణిక’ విడుదలైన టైంలో అతడు అలాగే మాట్లాడారు. ఆ తర్వాత సినిమాపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేశారు. నాటి రోజులు నా జీవితంలో ఓ పీడకలలా మిగిలిపోయాయి. ఇప్పుడు అదే వ్యక్తి ‘ఎమర్జెన్సీ’ సినిమాను పొగుడుతున్నాడు. అంటే మరలా ఏదో ఉపద్రవం రాబోతుందని అర్థమవుతున్నది’ అని కంగనా వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. కరణ్‌జోహార్ పొగడ్తలను కూడా కంగనారనౌత్ సీరియస్‌గా తీసుకుందని, వీరిద్దరి మధ్య ఎప్పటికీ మైత్రి కుదరదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.