నటనకే పరిమితం కాని స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వివిధ విభాగాల్లో తన ప్రతిభను చూపిస్తుంటారు. స్క్రిప్ట్ రైటింగ్, స్టంట్ కొరియోగ్రఫీ, సాంగ్ కొరియోగ్రఫీ, డైరెక్షన్ వంటి వాటిలో పనిచేసిన అనుభవం ఆయనకుంది. ‘జానీ’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలకు కథ రాసిన పవన్…‘గుడుంబా శంకర్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. నటించే ప్రతి సినిమాలో తన అనుభవం మేరకు దర్శకులకు సూచనలు ఇస్తుంటారు పవన్. కొంత గ్యాప్ తర్వాత పవన్ మరోసారి కథను అందిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే సినిమా కథా రచనలో పవన్ భాగమవుతున్నట్లు తెలుస్తున్నది. దీనిపై టీమ్ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. గతంలోనే ప్రకటన వెలువడిన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నది. లాక్‌డౌన్‌తో పాటు పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉండటమే ఈ సినిమా ఆలస్యానికి కారణంగా తెలుస్తున్నది.