Border 2 | సన్నీ డియోల్, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ 2’ (Border 2). ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా.. జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి తాజాగా ‘ది బ్రేవ్స్ ఆఫ్ ది సాయిల్’ (#TheBravesOfTheSoil) పేరుతో కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. భారత సైనికుల అసమాన త్యాగాలను, దేశభక్తిని కళ్లకు కట్టేలా ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మిథూన్ స్వరాలు, సోనూ నిగమ్ గానం, మనోజ్ ముంతాషిర్ సాహిత్యం ఈ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది.
1971 భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ భారీ సీక్వెల్లో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ విభాగాలకు చెందిన వీర సైనికులుగా కనిపించబోతున్నారు. ముఖ్యంగా నిజ జీవిత యుద్ధ వీరులైన మేజర్ హోషియార్ సింగ్ దహియా, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ వంటి హీరోల సాహసాలను ఈ సినిమాలో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌లో కేవలం 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడుపోవడం ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.