2025 మరికొద్ది రోజుల్లో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పబోతున్నాం. వెండితెరపై తారాడిన అందమైన అనుభూతుల వర్ణ చిత్రంలా ఓ వసంతం కనుల ముందు నుంచి మెల్లగా కదిలిపోతున్నది. ఈ ఏడాది తెలుగు సినీరంగం నిరాశపూరితమైన ఫలితాలను నమోదు చేసింది. ఎన్నోఏళ్లుగా టాలీవుడ్ సక్సెస్‌రేట్ కేవలం పదిశాతమే. 2025లో అది కూడా తగ్గిందని ట్రేడ్వర్గాల విశ్లేషణ. పాన్ ఇండియా అంటూ ఊదర గొట్టిన అగ్ర హీరోల భారీ చిత్రాలు సైతం బాక్సాఫీస్ బరిలో చతికిలపడటం ఇండస్ట్రీకి శరాఘాతంగా మారింది. ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధంలో ఇండస్ట్రీ కొంత మెరుగుపడింది. ఈ సంవత్సరం వచ్చిన సినిమాల సంఖ్య కూడా తక్కువే. మొత్తంగా
రెండొందల మార్కును కూడా దాటలేదు. ఇక ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న మార్పులకు ఈ ఏడాది అద్దం పట్టింది. పీరియాడిక్, పౌరాణిక, ఆధ్యాత్మిక అంశాలు కలబోసిన లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలకు జనాలు పట్టం కట్టారు. గతంతో పోల్చితే విజయాల శాతం పడిపోవడం మాత్రం టాలీవుడ్‌కు ఓ హెచ్చరికగా భావించాల్సి వస్తున్నది. కాంబినేషన్స్, భారీ పాన్ ఇండియా సెటప్ కంటే కంటెంట్ మీద దృష్టి పెట్టాల్సిన అవశ్యకతను 2025 చాటిచెప్పింది.
ఈ ఏడాది విడుదలైన రెండొందల చిత్రాల్లో కేవలం పదిపన్నెండు చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. నాలుగైదు చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి. అంటే విజయాలు పదిశాతంలోపే అని చెప్పొచ్చు. వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది. ఆద్యంతం అలరించిన హాస్యం, జనరంజకమైన గీతాలు ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించాయి. వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. పవన్‌కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ కూడా.. ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. రెండు వారాల కిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలకృష్ణ డివోషనల్ థ్రిల్లర్ ‘అఖండ-2’ బాక్సాఫీస్ రన్ ఇంకా కొనసాగుతున్నది.
ఇప్పటికి రూ.130 కోట్లపైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ఫలితం తేలనుంది. తేజ సజ్జా నటించిన సూపర్‌హీరో ఫాంటసీ అడ్వెంచర్ ‘మిరాయ్’ రూ.130 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దుష్టశక్తికి, దైవసంకల్పంతో పుట్టిన ఓ సామాన్యుడికి మధ్య సంగ్రామం నేపథ్యంలో మదర్సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నాని యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్-3’, ధనుష్-నాగార్జున ‘కుబేర’, నాగచైతన్య ‘తండేల్’ రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించాయి. చైతూ కెరీర్లో వందకోట్ల మైలురాయిని దాటిన తొలిచిత్రమిదే కావడం విశేషం.
ఇక హింస ఎక్కువైందనే విమర్శలు ఎదుర్కొన్న ‘హిట్-3’ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే రాబట్టింది. ‘మ్యాడ్ స్వేర్’, ‘కే-ర్యాంప్’ చిత్రాలు యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం స్త్రీ స్వేచ్ఛ, నిర్ణయాధికాకం లాంటి అంశాలను చర్చిస్తూ సందేశాత్మక కథతో ప్రశంసలందుకుంది. మంచి వసూళ్లను సాధించింది. ఇటీవల విడుదలైన తెలంగాణ నేపథ్య పీరియాడిక్ చిత్రం ‘ఛాంపియన్’, ఆది నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’, సాంఘిక అసమానతలను చర్చించిన ‘దండోరా’ చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఆయా చిత్రాల బాక్సాఫీస్ రన్ కంటిన్యూ అవుతున్నందున తుది ఫలితం కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
చిన్న చిత్రాలు.. పెద్ద విజయాలు
కంటెంటే కింగ్ అని, కథలో నవ్యత ఉంటే చిన్న చిత్రాలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే విషయాన్ని ఈ ఏడాది నిరూపించింది. హీరో నాని నిర్మించిన ‘కోర్ట్’ చిత్రం రూ.50 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా నచ్చకపోతే తన తదుపరి చిత్రం ‘హిట్-3’ చూడకండని నాని చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. చెప్పినట్లుగానే నాని జడ్డిమెంట్ ఫలించి ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు భారీ వసూళ్లను కూడా సాధించింది.
ఇక ఈ సంవత్సరం ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. పెట్టుబడి, లాభాల నిష్పత్తితో పోల్చితే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రమని చెప్పొచ్చు. మూడు కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.40 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. తెలంగాణ నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం రూ.15 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అఖిల్, తేజస్వి రావు జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హార్డ్‌హిట్టింగ్ స్టోరీ, షాకింగ్ ైక్లెమాక్స్తో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. సమంత నిర్మించి అతిథి పాత్రలో నటించిన ‘శుభం’, తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌షో’ చిత్రాలు మంచి ప్రయత్నాలుగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.

సత్తా చాటిన కొత్త దర్శకులు
ఈ ఏడాది ప్రతిభావంతులైన దర్శకులు తెలుగు తెరకు పరిచయమయ్యారు. తమదైన ప్రతిభతో తొలి చిత్రాలతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘కోర్ట్’ చిత్రం ద్వారా రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. పోక్సో చట్టం నేపథ్యంలో, చట్టాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొచ్చింది. త్వరలో ఈ దర్శకుడు నానితో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. రొమాంటిక్ కామెడీ చిత్రం ‘లిటిల్ హార్ట్స్’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సాయి మార్తాండ్. నేటి యువత మెచ్చేలా చక్కటి వినోదంతో సినిమాను తీర్చిదిద్దాడు. ఈయన ప్రతిభకు మెచ్చి హీరో నితిన్ సినిమా ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంతో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రీ వెడ్డింగ్ షూట్ నేపథ్యంలో చిన్న పాయింట్‌తో రూపొందించిన ఈ సినిమాలో ఆయన కథను నడిపించిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. యువహీరోతో ఆయన సినిమా చేయబోతున్నాడని టాక్. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచమయ్యాడు. సున్నితమైన ఈ కథను వాస్తవికత ప్రధానంగా మలచిన తీరు విమర్శకులు ప్రశంసలందుకుంది. ప్రస్తుతం ఆయనకు భారీ ఆఫర్లొస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే విడుదలైన తెలంగాణ నేపథ్య పీరియాడిక్ చిత్రం ‘ఛాంపియన్’తో మెగాఫోన్ పట్టాడు ప్రదీప్ అద్వైతం. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రసిద్ధికెక్కిన బైరాన్‌పల్లి ఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాను భావోద్వేగభరితంగా తెరకెక్కించడంలో ప్రదీప్ సఫలీకృతుడయ్యాడు. యుగంధర్ ముని (శంబాల), మురళీకాంత్ (దండోరా) సైతం తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
బ్రేక్ తీసుకున్న అగ్ర హీరోలు
2025లో వెండితెరపై కనిపించని హీరోల్లో ప్రథమంగా చెప్పుకోవాల్సిన హీరో మెగాస్టార్ చిరంజీవి. 2023 ద్వితీయార్ధంలో ఆయన నటించిన ‘భోళా శంకర్’ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ఆయన్నుంచి సినిమా లేదు. ఇంతటి సుదీర్ఘ విరామం తర్వాత ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో రాబోతున్నాడు చిరంజీవి. ఇక ఈ ఏడాది వెండితెరపై కనిపించని మరో బిగ్‌స్టార్ మహేశ్‌బాబు. 2024 సంక్రాంతికి ఆయన హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ విడుదలైంది. ఆ తర్వాత ఆయన సినిమా ఏదీ విడుదల కాలేదు. ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 2026 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 2024 డిసెంబర్ 5న ‘పుష్ప 2’తో పలకరించాడు అల్లు అర్జున్. ఆ తర్వాత బన్నీ నుంచి సినిమా లేదు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక 2024 బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898ఏడీ’ తర్వాత ప్రభాస్ మళ్లీ తెరపై కనిపించలేదు. ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్’తో గతేడాది లోటును భర్తీ చేయనున్నాడు ప్రభాస్.
చుట్టుముట్టిన వివాదాలు
ఈ సంవత్సరం టాలీవుడ్లో విజయాల కన్నా వివాదాలే మిన్నగా సాగాయి. సినీ పరిశ్రమలో ఈ ఏడాది నడిచిన అతిపెద్ద వివాదం సినీకార్మికుల సమ్మె. వేతనాలు పెంచాలంటూ, ఇతర రాష్ర్టాలకు చెందిన టెక్నీషియన్స్‌తో పని చేయించకూడదంటూ పలు షరతులతో సినీ కార్మికులు చేసిన సమ్మె నిరవధికంగా దాదాపు 15 రోజుల పాటు సాగింది. ఎట్టకేలకు ప్రభుత్వ జోక్యంతో అప్పటికి కథ సుఖాంతమైంది. నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ చేసిన దారుణమైన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రకంపనాలు సృష్టించాయి. నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేయడం, తనను క్షమించమని ఆమె నాగార్జునను ప్రాధేయపడటం ఇవన్నీ ఈ ఏడాదే జరిగాయి.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఈ ఏడాది వివాదాల్లో ప్రముఖంగా నిలిచాడు. తాను కీలకపాత్ర పోషించిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఈవెంట్లో అందులోనే ప్రత్యేక పాత్ర పోషించిన విఖ్యాత క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి, పెద్ద చర్చకే దారితీశాడు రాజేంద్రప్రసాద్. అలాగే తన సహ నటులైన అలీని, బ్రహ్మానందాన్ని కూడా ఇలాగే వేరువేరు వేదికలపై అసభ్యకరంగా మాట్లాడటం.. అటు ఇండస్ట్రీలో ఇటు మీడియాలో చర్చనీయాంశమైంది. వివాదాలకు దూరంగా ఉండే దర్శకధీరుడు రాజమౌళి సైతం ఈ ఏడాది వివాదాల్లో చిక్కుకున్నాడు. తన సినిమా ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబ్ ట్రాటర్’ వేడుకలో జరిగిన చిన్న అసౌకర్యం కారణంగా అసహనానికి గురైన రాజమౌళి.. హనుమంతుడిపై నిందాస్తుతి చేయడం,‘దేవుడ్ని నమ్మను’ అనడం.. హిందూ సమాజంలోని ఓ వర్గానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్ మీడియాలో రాజమౌళి పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రీసెంట్గా ‘దండోరా’ ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ మాట్లాడిన మాటలు మహిళాసంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి.
తగ్గిన డబ్బింగ్ చిత్రాల హవా
ఇక ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు దాదాపుగా ఓ 50 విడుదలైతే.. వాటిల్లో విజయాలు మాత్రం అరకొరే. 2025లో విడుదలైన తొలి డబ్బింగ్ సినిమా ‘మార్కో’. ఉన్నిముకుందన్ కథానాయకుడిగా రూపొందిన ఈ మలయాళ చిత్రం.. జనవరి 1న విడుదలై హింసాత్మకమైనదిగా విమర్శలు ఎదుర్కొన్నది. అయితే.. బాక్సాఫీస్ పరంగా మాత్రం విజయాన్ని అందుకున్నది. విక్కీకౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ తెలుగు వెర్షన్ కూడా బాగా ఆడింది. మోహన్‌లాల్ ‘తురుడమ్’, మరో మలయాళ చిత్రం ‘కొత్త లోకం- చాప్టర్ 1’ కూడా తెలుగులో భారీ విజయాన్నే అందుకున్నాయి. ఇక ఈ ఏడాది కన్నడం నుంచి వచ్చిన యానిమేటెడ్ పౌరాణిక యాక్షన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ రూ.600 కోట్లతో పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటింది. ‘కాంతార- చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా దాదాపు రూ.500 కోట్ల వసూళ్లు సాధించి బిగ్ హిట్‌గా నిలిచింది.
తప్పిన అంచనాలు
భారీ హైప్‌తో విడుదలైన అగ్ర హీరోల చిత్రాలు కొన్ని ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. పవన్‌కళ్యాణ్ హిస్టారిక్ ఫిక్షన్ ‘హరిహర వీరమల్లు’, ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం ‘వార్-2’, రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’, విజయ్ దేవరకొండ పీరియాడిక్ మూవీ ‘కింగ్డమ్’, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, ‘మాస్ జాతర’, కళ్యాణ్‌రామ్ ‘సన్నాఫ్ వైజయంతీ’ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో ఫెయిల్యూర్స్‌గా మిగిలాయి. ముఖ్యంగా అగ్ర హీరోల పాన్ ఇండియా చిత్రాలు చాలావరకు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
సినిమా డెస్క్