సామాజికన్యాయం కరువై సామాన్యుడు అణచివేతకు గురవుతున్నప్పుడు సమాజంలో విప్లవం పుట్టుకొస్తుంది. అలా పుట్టుకొచ్చిన విప్లవం హింసాత్మకంగా మారితే? ఈ తరహా ఇతివృత్తంతో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెదకాపు1’. నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విరాట్ కర్ణ కథానాయకునిగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక.
ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ను సోమవారం హైదరాబాద్లో దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ- ‘ వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే కథాంశంతో ఈ సినిమా తీశాను. కథ రీత్యా హింస ఎక్కువగా ఉన్నా.. తద్వారా మంచే చెప్పాం.
ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ఈ కథ ఓ సామాన్యుడి సంతకం. ఈ కథలోని వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలూ అన్నీ సమాజంలోంచి తీసుకున్నవే. నిజాన్ని చూస్తున్న అనుభూతికి లోనుచేసే సినిమా ఇది’ అన్నారు. ఈ సినిమాలో నటించినందుకు హీరోహీరోయిన్లు ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాగా భావించి, ప్రాణం పెట్టి పనిచేశామని ఛాయాగ్రకుడు చోటా కె.నాయుడు అన్నారు.