Kalki 2898 AD | ఇప్పటివరకూ వచ్చిన భారతీయ సినిమాలన్నీ ఒకెత్తు.. ‘కల్కి 2898’ ఒకత్తు అనేలా ఉంది శుక్రవారం విడుదలైన ట్రైలర్. ‘భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉందంటారు.. అలాంటిది, మీ కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడు..’ అంటూ అశ్వత్థామగా అమితాబ్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. దైవాన్ని గర్భాన మోస్తున్న దీపికను, ఆమె గర్భస్థ శిశువును కలి బారినుండి కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్న అశ్వత్థామను ఈ ట్రైలర్లో చూడొచ్చు. కలియుగాంతంలో కలి పురుషుని దారుణాలు భరించలేక, మాధవుని ఆగమనం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యుల ఆక్రందనలు ఈ ట్రైలర్లో చూడొచ్చు. ‘రేపటి కోసం’ జనం ఎదురుచూస్తుంటే, ‘ఈ రోజును చంపితే రేపెలా ఉంటుంది?’ అంటూ కలి పురుషుడు చేసే వికటాట్టహాసాన్నీ, విఫలయత్నాన్నీ ఈ ట్రైలర్లో చూడొచ్చు. ‘ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలిచ్చినా మనిషి మారడు.. మారలేడు..’ అని నిర్భయం..
నిక్కచ్చిగా చెబుతున్న కలి పురుషుడి విచిత్రరూపంలో కమల్‌హాసన్‌ని ఈ ట్రైలర్లో చూడొచ్చు. ఏదోఒకటి చేసి సకల సౌకర్యాలుండే ‘కాంప్లెక్స్’కి వెళ్లిపోవాలని ప్రయత్నించే భైరవ ఎవరు? భైరవకీ అశ్వత్థామకూ మధ్య యుద్ధం ఎందుకొచ్చింది? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా ఈ ట్రైలర్ ఉంది. మొత్తంగా మన పురాణాలకు హాలీవుడ్ సొగబులద్ది, ఓ కొత్తలోకాన్ని ట్రైలర్లో ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్అశ్విన్. ‘ఇప్పటివరకూ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. ఇది కూడా ఓడిపోను..’ అనే డైలాగ్ నాగ్అశ్విన్ కోసమే రాసినట్టుంది. ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకొనే, శోభన, మాళవిక నాయర్.. పాత్రలు ట్రైలర్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నెల 27న విడుదల కానున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898’ను ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే.