జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ర్టాల్లో సినిమా థియేటర్ల బంద్ జరగబోవడం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. సింగిల్ థియేటర్లలో కూడా పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి బంద్‌కు సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు పలు దఫాలుగా సమావేశమయ్యారు. తాజాగా శనివారం నిర్వహించిన సమావేశంలో ఎలాంటి బంద్ ఉండబోదని ఛాంబర్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాకు వివరాలను తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ ‘శనివారం జరిగిన సమావేశంలో ఇరు రాష్ర్టాల ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లందరూ పాల్గొన్నారు. బంద్ అంశాన్ని చాలా తప్పుగా ప్రచారం చేశారు. ఒకవేళ చర్చలు జరగకపోతే జూన్ 1వ తేదీ నుంచి బంద్‌కు ఆస్కారం ఉండేది కావొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి బంద్ లేదు. సింగిల్ థియేటర్ల పర్సంటేజీ అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది. దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
మూడు సెక్టార్ల నుంచి ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఓ నిర్ణీత కాలపరిమితితో కమీటీ సమస్యకు పరిష్కారాలను సూచిస్తుంది. ఈ నెల 30న జరిగే సమావేశంలో కమిటీని నిర్ణయిస్తాం’ అన్నారు. బంద్ గురించిన దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, తెలుగు ఛాంబర్ మాత్రమే అధికారిక సమాచారాన్ని వెల్లడిస్తుందని, ఇండస్ట్రీలోని సమస్యలపై త్వరలో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని దామోదర ప్రసాద్ పేర్కొన్నారు.