Telangana Slang in Tollywood | మన ‘మల్లేశం’ మస్తు సినిమా అనిపించుకున్నది! మనకు ‘బలగం’ తక్వున్నదా అని తెలుగు సినిమా నిరూపిస్తున్నది!! తెలుగు సినిమాల్లో తెలంగాణ సంస్కృతి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. భాష, యాస, కట్టూబొట్టూ ఒకటేమిటి కథంతా తెలంగాణ చుట్టే తిరుగుతున్నది. సినిమాల్లో నటించే హీరోలు సైతం మన యాస పలుకుతూ అలరిస్తున్నారు. తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక కూడా అదే యాస మాట్లాడుతూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.
ఒకప్పుడు తెలుగు సినిమాలో తెలంగాణ మాండలికాన్ని వెకిలి పాత్రలకు పరిమితం చేశారు. పనిగట్టుకొని మరీ హాస్యనటుల ద్వారా అపహాస్యంగా వినిపించారు. కత్తిగట్టి విలన్ల నోటివెంట పట్టుబట్టి తెలంగాణ యాసను మట్టుపెట్టారు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్ మార్చింది. తెలంగాణ భాషను ప్రధాన పాత్రకు భూషణంగా అలంకరిస్తున్నారు దర్శక, రచయితలు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో గోదావరి ఎక్స్ప్రెస్దిగే హీరో.. ఇప్పుడు మెదక్ బస్సు ఎక్కుతున్నాడు. మన యాసను వెటకారంగా అనుకరించే రోజులు పోయాయి. కొందరు తెలుగు హీరోలు ఇప్పుడు తెర వెనుక కూడా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతున్నారు. విజయ్ దేవరకొండ, ప్రియదర్శి, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ తదితర నటులు తెలంగాణ యాసతోనే సూపర్హిట్లు కొట్టారు. దీనికితోడు తెలంగాణ నేపథ్యం ఉన్న కథలు వెండి తెరపై వెలుగులీనుతున్నాయి.
‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో అకస్మాత్తుగా సూపర్‌స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాకు ముందు ‘పెళ్లిచూపులు’ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ రెండు చిత్రాల్లోనూ విజయ్ తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ పక్కా లోకల్ అనిపించుకున్నాడు. తర్వాత వచ్చిన సినిమాల్లోనూ తెలంగాణ యాసను కొనసాగిస్తున్నాడు. సినిమాల్లోనే కాదు బయట ఈవెంట్లలోనూ లోకల్ యాసలో మాట్లాడుతూ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు.
విజయ్ దారిలోనే కొనసాగుతున్నాడు హీరో విశ్వక్సేన్. తను నటించిన సినిమాల్లో మాత్రమే కాదు, పబ్లిక్ మీట్స్‌లో కూడా తెలంగాణ యాసతో ఇరగదీస్తున్నాడు. ఈ ఇద్దరి సరసన హీరో సిద్ధు జొన్నలగడ్డ వచ్చి చేరాడు. ‘డీజే టిల్లు’లో హైదరాబాదీ యాసతో ఆకట్టుకున్న సిద్ధు ఎక్కడికి వెళ్లినా అదే జోరులో మాట్లాడుతుంటాడు. ‘పెళ్లిచూపులు’ సినిమాతో హాస్యనటుడిగా తన సత్తా చాటిన నటుడు ప్రియదర్శి. ఏ పాత్ర పోషించినా తెలంగాణ యాస మిస్ అవ్వకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఆసు యంత్రం కని పెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా పండించాడు. తర్వాత కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. తాజాగా ‘బలగం’ చిత్రంలో మనదైన యాసను మనసుతో పలికి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గానీ సినిమాల్లో మన ఇతివృత్తాలకు చోటు దక్కలేదు! అంతకుముందు అడపా దడపా తెలంగాణతో ముడిపడిన కథలతో సినిమాలు వచ్చినా.. విప్లవ నేపథ్యం ఉన్నవే ఎక్కువగా కనిపించేవి. తెలంగాణ సిద్ధించిన తర్వాత మన ఇలాకా కథలతో తడాఖా చూపిస్తున్నారు పలువురు దర్శకులు. ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాతో తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని తెరమీద ఆవిష్కరించాడు. ఈ ప్రాంతంలో ఉండే ఆచారాలనూ చూపించే ప్రయత్నం చేశాడు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా 2021లో విడుదలైన ‘లవ్‌స్టోరీ’ సినిమాలోనూ తెలంగాణ మాండలికానికి పెద్దపీట వేశాడు.
Ntr
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్ పాత్ర తెలంగాణ గరిమను చాటిచెప్పింది. అందులో చంద్రబోస్ రాసిన ‘నాటు నాటు’ పాట మన మాండలికంలోని పటుత్వాన్ని విశ్వవ్యాప్తం చేసింది. ఏకంగా ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ‘కొమురం భీముడో.. ’ గీతం మన మట్టి పరిమళాన్ని అందరికీ పంచింది.
Priyadarshi
తాజాగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా నేపథ్యం కూడా తెలంగాణ కావడం విశేషం. పక్కా మాస్ ఎంటర్టైనర్గా నిర్మించిన ఈ చిత్రంలో హీరో డైలాగులు ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లుగా రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ‘ఎట్లయితే గట్లాయె గుండుగుత్తగ’ హిట్టు ఖాయమని నిరూపించినయి.