టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కలిసి నటించే మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య థార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. జియో స్టూడియోస్ నిర్మించనుందట. పౌరాణిక నేపథ్య కథతో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే చిత్రాన్ని రూపొందించేందుకు గత కొద్ది కాలంగా సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు ఆదిత్య థార్.
ఈ చిత్రానికి హీరోలుగా గతంలో విక్కీ కౌశల్, రణ్వీర్ సింగ్ పేర్లు పరిశీలించారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్ను బాలీవుడ్ మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు నాయికగా సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. పలు విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారీ ఇద్దరు కథానాయకులు. మంచి స్నేహితులైన ఎన్టీఆర్, అల్లు అర్జున్‌కు బావా అని పిలుచుకునేంత చనువు ఉంది. ఈ ప్రాజెక్ట్ వాస్తవంలోకి వస్తే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరో భారీ మల్టీస్టారర్ కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో నటిస్తుండగా, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్లో ఉన్నారు.