ద సీక్రెట్ ఆఫ్ ద శీలేదార్స్
డిస్నీ+ హాట్ స్టార్: జనవరి 31, 2025
తారాగణం: రాజీవ్ ఖండేల్వాల్, సాయి తమ్హన్కర్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ అమ్లాని, కన్నణ్ అరుణాచలం, దిలీప్ ప్రభావల్కర్ తదితరులు
దర్శకుడు: ఆదిత్య సర్పోత్దార్
OTT Hit | నిధుల వేట, చారిత్రక నేపథ్యం.. భారతీయ చిత్రసీమలో ఎవర్గ్రీన్ కాంబినేషన్! ఈ రెండిటి కలయికలో ఏ భాషలో సినిమా వచ్చినా.. హిట్ అవ్వాల్సిందే! బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవాల్సిందే! గతంలోనూ ఈ జానర్లో వచ్చిన ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లకు భారతీయ అభిమానులు పట్టం కట్టారు. అలాంటి నిధుల వేట, చారిత్రక నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్.. ‘ద సీక్రెట్ ఆఫ్ ద శీలేదార్స్’. డాక్టర్ రవిప్రకాశ్ కొయాడే రాసిన మరాఠీ నవల ‘ప్రతీపశ్చంద్ర’ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో ఇటీవలే స్ట్రీమింగ్కు రాగా.. హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. 1996లో మొదలై.. ప్రస్తుత కాలంలో నడిచే కథ ఇది. డా॥రవి భట్ (రాజీవ్ ఖండేల్వాల్).. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు.
బాల్యం నుంచే ఛత్రపతి శివాజీ కథలు వింటూ పెరుగుతాడు. దాంతో, అతనికి శివాజీపై ఎంతో గౌరవభావం ఉంటుంది. ఇలా ఉండగా, ఒకరోజు రవిని.. న్యాయమూర్తి కృష్ణకాంత్ దీక్షిత్ (దిలీప్ ప్రభావల్కర్) కలుస్తాడు. ఆయన ఛత్రపతి శివాజీకి చెందిన రహస్య నిధి కోసం కొన్నేళ్లుగా అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో శివాజీ మహారాజ్ నిధికి, రవి భట్‌కు ఉన్న సంబంధం గురించి తెలుసుకుంటాడు. దాంతో రవిని కలిసి.. అతనికి ఒక పుస్తకాన్ని అందించి.. శివాజీ మహారాజ్‌కు చెందిన నిధి గురించి చెబుతాడు.
మరి.. ఆ నిధి ఎక్కడ ఉంది? దాని జాడను రవి ఎలా కనుక్కుంటాడు? ఆ నిధిని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? దాన్ని భద్రంగా దాచిపెట్టి.. ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న శీలేదార్లు ఎవరు? వారికీ, రవికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ఆసక్తికరమైన మలుపులు తెలుసుకోవాలంటే.. సిరీస్ ఆసాంతం చూడాల్సిందే!