స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తన సినిమాల వేగాన్ని పెంచారు. వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’. హరీశ్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాధ్ భగత్‌సింగ్’, దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రాలున్నాయి. ఇక తాజాగా మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు పవన్.
తమిళ హిట్ మూవీ ‘వినోదయ సితం’ రీమేక్‌ను పవన్ ఒప్పుకున్న విషయం తెలిసిందే. తమిళంలో విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో సాయి ధరమ్‌తేజ్‌తో కలిసి పవన్ చేయబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 14న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందట. ఆ రోజు ప్రేమికుల దినోత్సవం కావడం విశేషం.