‘రామాయణ’ చిత్రాన్ని నాలుగువేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్‌మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ భారతీయ పురాణేతిహాసాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. సాయిపల్లవి, రణబీర్‌కపూర్ సీతారాముల పాత్రల్లో, యష్ రావణుడిగా కనిపించనున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ అత్యున్నత సాంకేతిక హంగుల మేళవింపుతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సరికొత్త అప్డేట్ను వెలువరించింది. ఈ సినిమాలో సీతారాముల పాత్రలకు సాయిపల్లవి, రణబీర్కపూర్లను ఎంపిక చేయడానికి గల కారణాలను వివరించింది.
‘రణబీర్‌కపూర్ అద్భుతమైన నటుడు. ప్రశాంతమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. అందుకే ఆయన్ని రాముడి పాత్రకు తీసుకున్నాం. ఇక సాయిపల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. సహజమైన అందంతో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె అందం కోసం కాస్మొటిక్స్ ఉపయోగించదు. ఎలాంటి సర్జరీలు కూడా చేయించుకోలేదు. కృత్రిమ హంగుల కన్నా సహజసిద్ధమైన అందమే గొప్పదనే సందేశాన్ని కూడా అందించినట్లు ఉంటుంది. అందుకే సీత పాత్రకు సాయిపల్లవి పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది’ అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’కు పనిచేసిన స్టంట్ డైరెక్టర్ టెర్రీ పనిచేయబోతున్నారని చిత్రబృందం తెలిపింది. ‘రామాయణ’ తొలిభాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి
ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.