రామం.. రాజీవ లోచనం అంటాడు దశరథుడు. రామో విగ్రహవాన్ ధర్మః అని కీర్తించాడు మారీచుడు.రూపంలో రాముడంటే రాముడే! గుణగణాల్లోనూ రాముడంటే రాముడే!! అంతటి రాముడు దక్షిణాది సిల్వర్ స్క్రీన్‌పై అంతే గొప్పగా వెలుగులీనాడు.ముఖ్యంగా తెలుగు సినిమాలు.. రాములవారిని ముమ్మూర్తులా నీలాంబుజ శ్యామల కోమలాంగమూర్తిగానే చూపించాయి. ఇందీవర శ్యాముడిగా వెలుగొందిన వెండితెర రామయ్య.. అందరివాడు అనిపించుకున్నాడు. పాన్ ఇండియా ఫార్ములా రాములోరి పాత్రను భిన్నంగా చూపిస్తున్నది. ఉత్తారాది టేకింగ్ నీలిమేఘ ఛాయను అరుణారుణ శోభితంగా మార్చేస్తున్నది. ఈ పోకడకు దక్షిణాది ఎలా స్పందిస్తుందో తెలియాలంటే.. తాజాగా తెరకెక్కుతున్న రామకథలు బాక్సాఫీస్ ముందుకు రావాల్సిందే!!

చదివితే పొందే భావోద్వేగం చూస్తే రాదంటారు. ఎందుకంటే.. చదువు మనసుకు చెందినది. చదువుతున్నప్పుడు భావకులు వారి మనసులకు తోచినట్టుగా ఆయా పాత్రల రూపాలను ఊహించుకుంటారు.. గొడవే లేదు. అయితే.. అదే కావ్యాన్ని చూడాల్సివస్తే.. నిర్వాహకుడు (దర్శకుడు) చూపించిందే ఫైనల్. అది జనరంజకంగా ఉందా? లేదా? అనేది నిర్వాహకుడి అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. కథకులు, కవులు, కళాకారులు, చిత్రకారులు ఆది నుంచీ అలవాటు చేసిన పలు కళాకృతుల విషయంలో జనాలకు కచ్చితమైన అభిప్రాయాలు ఈ విధంగానే ఏర్పడ్డాయి. వాటిలో మార్పుల్ని సమాజం సహించదు.

ఉదాహరణకు రవివర్మ, వడ్డాది పాపయ్య, బాపు.. ఇత్యాది చిత్రకారులు గీసిన అద్భుతమైన దేవతా స్వరూపాలు.. జన హృదయాల్లో బలంగా ముద్రించుకుపోయి పూజలందుకుంటున్నాయి. వాటిని మరోలా చిత్రీకరించి చూపిస్తే జనం అంతగా ఆదరించరు. ఏ పురాణ కళారూపాన్ని సృష్టించాలన్నా భావి తరాలకు ఈ రూపాలే ప్రామాణికాలు. అంతెందుకు.. పురాణపాత్రల పోషణ విషయంలో ఎన్టీఆర్‌కి రవివర్మ చిత్రాలే ప్రేరణ. తాను నటించిన పురాణ పాత్రలకు చెందిన ఫొటోలను బయటికి విడుదల చేసే విషయంలోనూ ఎన్టీఆర్ తగు జాగ్రత్తలు తీసుకునేవారట. రవివర్మ చిత్రాలకు దగ్గరగా తన రూపం ఉండేలా చూసుకునేవారట.
అయితే.. అసలు రామాయణం రాసిన వాల్మీకి వర్ణనను అనుసరించే వీరంతా రాముడి రూపాన్ని చిత్రీకరించారా? వ్యాస మహర్షి వర్ణనలకు అనుగుణంగానే మహాభారత, భాగవతాల్లో ఆయా పాత్రల రూపాలు రూపుదిద్దుకున్నాయా? అంటే మౌనమే సమాధానం అవుతుంది. ఏదేమైనా చూసిన దాన్నే జనం నమ్ముతారు. కాబట్టి ‘దేవుళ్లు ఇలాగే ఉంటారు’ అని అంతా ఫిక్సయిపోయారు. అయితే.. ఈ విషయంలో కూడా దక్షిణ భారతీయుల అభిప్రాయాలు ఒకలా ఉంటే.. ఉత్తర భారతీయుల అభిప్రాయాలు మరోలా ఉంటాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్ సినిమా మేకర్లకు శ్రీరాముడి రూపం ఓ టాస్క్ అయి కూర్చుంది. రాముడంటే భారతీయులకు ఓ ఎమోషన్. అందుకే.. సినిమా వాళ్లంతా రాముడి పాత్ర చుట్టూ కథలల్లేస్తూ తెగ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్నది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. ఇటీవలే శ్రీరాముడిగా ఆయన లుక్‌ని కూడా విడుదల చేశారు. రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో ఈ ఫ్రాంచైజీ తెరకెక్కుతున్నట్టు సమాచారం.

మరోవైపు టాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘వారణాసి’లో కథానుగుణంగా ఓ 30 నిమిషాలపాటు రామాయణాన్ని చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ ఎపిసోడ్లో రాముడిగా మహేశ్‌బాబు కనిపించనున్నారు. దీంతో రాముడిగా మహేశ్ ఏఐ చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ ‘ఆదిపురుష్’ పేరుతో రామాయణాన్ని తీసి చేతులు కాల్చుకున్నాడు. ప్రభాస్ ఇందులో రాముడిగా కనిపించి విమర్శలపాలయ్యాడు. జనాభిప్రాయానికి భిన్నంగా రామాయణాన్ని చూపిస్తే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ‘ఆదిపురుష్’ ద్వారా చవిచూశారు దర్శకుడు ఓం రావత్.

ఇదిలా ఉంటే.. అటు ఉత్తరాదిలో, ఇటు దక్షిణాదిలో రాముడి కథలు రానుండటంతో శ్రీరాముడి రూపం ప్రస్తుతం జనాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణాది ప్రేక్షకులకు రాముడు నీలమేఘశ్యాముడు. అలా అలవాటు పడిపోయాం. రాముడిగా నటించిన ఎన్టీఆర్, హరనాథ్, శోభన్‌బాబు, రవి (సీతాకళ్యాణం), సుమన్, బాలకృష్ణ వీరంతా తెరపై నీలమేఘశ్యాములుగానే కనిపించారు. కానీ, ఉత్తరాదిలో ఆ పరిస్థితి లేదు. అక్కడ రాముడు మామూలు మనిషి ఛాయలోనే కనిపిస్తాడు. ఓం రావత్ ‘ఆదిపురుష్’, తాజాగా విడుదలైన నితీష్ తివారీ ‘రామాయణ’ చిత్రాల్లో రాముడి రూపాలే అందుకు నిదర్శనం. ఒక్క రాముడు మాత్రమే కాదు. శ్రీకృష్ణుడు, శ్రీమహా విష్ణువు రూపాలను సైతం వారు నీలమేఘ వర్ణంలో చూపించరు. అందుకే.. ఆ తరహా రూపాలను దక్షిణాది ప్రేక్షకులు అంగీకరించడం కష్టం. అందుకే రాముడిగా రణబీర్ గెటప్‌పై మిశ్రమ స్పందన వచ్చింది.
నిజానికి మిగతా దేవతా స్వరూపాల నుంచి రాముడ్ని వేరు చేసేది ఆ ఛాయే. నీలిమేఘ ఛాయలో ధనుర్బాణాలు పట్టుకుని నిలబడితేనే మనకు రాముడు. ఆ ఛాయ లేనప్పుడు ఆ పాత్రను ఏ ఇంద్రుడో, ఏ గంధర్వుడో అనుకునే ప్రమాదం ఉన్నది. కానీ, ఈ విషయంలో ఉత్తరాది ప్రేక్షకుల అభిప్రాయం వేరుగా ఉంటుంది. ‘మనిషిగా పుట్టి దేవుడైనవాడు రాముడు.. అసలు ఓ మనిషికి ఆ రంగు ఉంటుందా?’ అని ప్రశ్నించేవారు కూడా అక్కడ లేకపోలేదు. దానికి తగ్గట్టే రామానందసాగర్ రామాయణంలో అరుణ్గోవిల్ని చూసినా, హిందీ పౌరాణిక చిత్రాల్లో రాముళ్లను చూసినా మామూలు రంగులోనే కనిపిస్తారు. వీరిలో కొందరికి కనీసం హరినామం కూడా ఉండదు. దర్శకుడు ఓం రావత్ అయితే.. ‘ఆదిపురుష్’లో ప్రభాస్‌ని మీసాల రాముడిగా చూపించాడు. మొత్తంగా చెప్పాలంటే.. మన రాముడు వాళ్లకు మింగుడు పడడు.. వాళ్ల రాముడు మనకు ఆనడు. కానీ, సినిమా ఏమో పాన్ ఇండియా రూపాన్ని సంతరించుకుంది. ఎవరు ఏ భాషలో తీసినా ఆ సినిమాను దేశం అంతా చూడాల్సిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో అసలు రాముడెలా ఉంటాడు? అనే ప్రశ్న జనాల్లో ఉత్పన్నమవడం సహజం. రామాయణంలో రాముడ్ని ‘ఆజానుబాహుం.. అరవింద దళాయతాక్షం’ అంటూ వాల్మీకి చక్కగా వర్ణించారు. రామాయణాన్ని, రాముడి పాత్రను లోతుగా అధ్యయనం చేస్తే కొన్ని విషయాలు అవగతమవుతాయి. శ్రీరాముడు క్షత్రియుడు. తండ్రి మాటకు కట్టుబడి 14 ఏండ్లు వనవాసం చేశాడు. 14 ఏండ్ల వనవాసం అంటే క్షుర సంస్కారానికి అవకాశం ఉండదు. అందుకే గుహుని సమక్షంలో మర్రిపాలతో తన జుట్టుని తడిపి ముడి వేసుకొని, ఆ ముడితోనే రాముడు వనవాసకాలం గడిపాడని రామాయణం చెబుతున్నది (మర్రిపాల వల్ల జుట్టు గడ్డ కడుతుంది).

ఈ క్రమంలో గడ్డం, మీసాలు కూడా పెరగడం సహజం. ఈ వాస్తవాన్ని తెరపై చూపిస్తే జనం చూస్తారా? మనసుల్లో ముద్రించుకుపోయిన దివ్యమంగళరూపానికి భిన్నంగా మరోరూపాన్ని చూపిస్తే జనానికి మింగుడు పడుతుందా? కేవలం అవార్డుల కోసం కళాత్మకతతో ప్రయోగాత్మక ధోరణిలో రామాయణాన్ని చూపించాలనుకుంటేనే ఇది సాధ్యం. కమర్షియల్‌గా అయితే వర్కవుట్ కాదు. ఒకవేళ గడ్డం, మీసాలు, కాషాయ వస్ర్తాల్లో రాముడ్ని చూపిస్తే తెలుగువాళ్లు ‘అల్లూరి సీతారామరాజు’ అనుకునే ప్రమాదం ఉంది. మొత్తంగా రాముడి రూపం విషయంలో మేకర్లకు ఇన్ని తలనొప్పులు ఉన్నాయి.
రేపు ‘వారణాసి’ సినిమాలో మహేశ్‌బాబుని రాముడిగా చూపించబోతున్నారు రాజమౌళి. ఆ లుక్ అయితే ఇంకా విడుదల కాలేదు. ఇది దక్షిణాదిన రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా. మరి ఇందులో ఉత్తరాది రాముడు ఉంటాడా? లేక దక్షిణాది రాముడు ఉంటాడా? అనేది తెలియాంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 దాకా ఆగాల్సిందే.
ఈ పాన్ ఇండియా యుగంలో దేశానికి నచ్చేలా సినిమా తీయాలంటే.. నాగరికత విషయంలో దర్శకులు జాగ్రత్త పడాలి. యూనివర్సల్‌గా ఆలోచించి సినిమా తీసినప్పుడే ఆ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువవుతుంది. ‘రాముడు’ యూనివర్సల్ క్యారెక్టర్. అయితే.. ఆయన రూపంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలున్నాయి. అలాంటి రాముడ్ని జనరంజకుడిగా జనానికి చూపించాలంటే ప్రస్తుత దర్శకులకు అది కత్తిమీద సామే.
చివరిగా చెప్పేదేంటంటే.. రామాయాణం లాంటి మహాకావ్యాన్ని మనసుతోనే చూడాలి.. మనసుతోనే చదవాలి. ‘రామో విగ్రహాన్ ధర్మః..’ అన్నాడు వాల్మీకి. అంటే.. రాముడు సాక్షాత్తూ మూర్తీభవించిన ధర్మస్వరూపుడు అని అర్థం. అలా అనిపించేలా తెరపై రాముడు ఉండాలి. ఉదాహరణకు ‘లవకుశ’లో ఎన్టీఆర్‌లా. ఆ సినిమా హిందీలోనూ బాగా ఆడింది. రామానందసాగర్ తీసిన ‘రామాయణం’ సీరియల్‌నే తీసుకోండి.. ఆసేతు హిమాచలం పరవశించి చూసింది. అరుణ్గోవిల్లో సాక్షాత్ రాముడ్ని చూసింది. అలా రాముడి పాత్రను తెరపై ఆవిష్కరించగలిగితే.. భాష ఏదైనా, జనం చూస్తారు.. జేజేలు పలుకుతారు!
– నరసింహ బుర్రా