The Hunt Trailer | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య భారత చరిత్రలో ఒక విషాదకర ఘటన మిగిలిపోయిన విషయం తెలిసిందే. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆయనపై ఆత్మాహుతి దాడి జరిగింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) సంస్థకు చెందిన ధను అనే ఆత్మాహుతి బాంబర్ RDX బాంబు పేల్చడంతో రాజీవ్ గాంధీతో పాటు 14 మంది మరణించారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో చాలా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం కూడా మద్రాస్ కేఫే అంటూ సినిమాను తీసి హిట్‌ను అందుకున్నాడు. అయితే రాజీవ్ గాంధీ హత్య కేసుపై తాజాగా ఒక వెబ్ సిరీస్ రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్‌లో ‘ది హంట్’ (The Hunt). అనే పేరుతో ఈ సిరీస్ రాబోతుండగా.. ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ (The Rajiv Gandhi Assassination Case) అనేది ఉపశీర్షిక. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అమిత్ సియాల్, సాహిల్ వైద్, భగవతీ పెరుమాళ్ తదితరులు నటించారు. జులై 4 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. గాంధీని హత్య చేయడానికి ఎలా ప్లాన్ చేశారు అనే కోణంలో ఈ సిరీస్ రాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
Read More