The Paradise | న్యాచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది పారడైజ్’పై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పని చేస్తుండటంతో సినిమా ప్రకటించినప్పటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదట ఈ చిత్రాన్ని 2026 మార్చిలో విడుదల చేయాలని మేకర్స్ భావించినట్లు ప్రచారం జరిగింది. అనంతరం సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా విడుదలను ఆగస్టుకు వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆగస్టు విడుదలకు సంబంధించి కూడా అధికారిక ప్రకటన రాకపోవడంతో సినిమా డిసెంబర్‌కు వెళ్లే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ‘ది పారడైజ్’ను సెప్టెంబర్ 25, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ‘ది పారడైజ్’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ, పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మేకింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ కూడా అంచనాలను దాటి భారీ స్థాయికి చేరినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారట. కంటెంట్, మేకింగ్ స్కేల్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.అలాగే బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ తారాగణం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. ‘ది పారడైజ్’ను కేవలం తెలుగు సినిమా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.