‘దసరా’ వంటి మాస్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న ‘ది పారడైజ్’ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ హైదరాబాద్ పీరియాడిక్ మూవీ తాలూకు గ్లింప్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాల్ని పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఇందుకోసం భారీ స్లమ్ సెట్‌ను తీర్చిదిద్దారట. దీనికి మధ్యలో ఎత్తైన ఆర్చ్‌తో కూడిన ఓ భవంతి సెట్‌కు కూడా డిజైన్ చేశారని చెబుతున్నారు.
ఆధిపత్య వ్యవస్థపై దిక్కార స్వరం వినిపించే ఓ సామాన్యుడి పోరాట కథగా, కమర్షియల్ హంగుల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘జడల్’ పాత్రలో ఇప్పటికే విడుదలైన నాని లుక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నారు.