అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా సైంటిఫిక్ ఫాంటసీ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. నాలుగైదు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. ఇప్పటికే దాదాపు 50 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తయినప్పటికీ ఈ సినిమా తాలూకు ఎలాంటి ప్రచార చిత్రం బయటకు రాలేదు. దాంతో ఈ సినిమా టైటిల్ గురించి, బన్నీ పాత్ర గురించి సోషల్‌మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. తాజాగా దానికి బలం చేకూర్చేలా దర్శకుడు అట్లీ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. సింహం ముఖాన్ని రెండు భిన్న రంగుల్లో చూపిస్తూ ఆయన షేర్ చేసిన ఫొటో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇది అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ గురించి ఇచ్చిన హింట్ అని అభిమానులు భావిస్తున్నారు.
ఈ పోస్టర్‌కు ‘నీలా ఎవరూ ఉండరు. అదే నీ శక్తి’ అంటూ క్యాప్షన్‌ను జోడించారు దర్శకుడు అట్లీ. ఈ క్యాప్షన్ సైతం సినిమా కథపై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది. రెండు సమాంతర ప్రపంచాల నేపథ్య కథాంశంతో భారీ గ్రాఫిక్స్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.