“లగ్గం’ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. కుటుంబ సమేతంగా చూడదగిన మంచి చిత్రమని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల గురించి ఈ సినిమాలో గొప్పగా చూపించాం’ అన్నారు నిర్మాత వేణుగోపాల్ రెడ్డి. ఆయన నిర్మాతగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో రూపొందించిన ‘లగ్గం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించారు. మంగళవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ఇంజనీర్ అల్లుడిగా కావాలని కోరుకుంటున్నారని, ఇదొక సమస్యగా మారిందని, ఈ అంశాన్ని సినిమాలో సందేశాత్మకంగా తెలియజెప్పారని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నదని, మళ్లీమళ్లీ చూసే విధంగా ఉందని, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు. చక్కటి కుటుంబ కథా చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోహీరోయిన్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.