సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. త్రీడీ ఫార్మేట్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మధుర గతమా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ పాటను మణిశర్మ స్వరకల్పనలో శ్రీమణి సాహిత్యాన్ని అందించగా..అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ పాడారు. దుర్వాసుడి శాపం కారణంగా గాంధర్వ వివాహానికి గుర్తుగా అందుకున్న ఉంగరాన్ని శకుంతల పోగొట్టుకుని, దుష్యంతుడికి దూరమైన బాధాకరమైన నేపథ్యంతో ఈ పాట సాగుతుంది. భావోద్వేగాలతో కూడిన పాటగా ప్రేక్షకుల్ని ఆర్థ్రతకు గురిచేస్తుందని చిత్రబృందం చెబుతున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, మధుబాల, గౌతమి తదితరులు కనిపించనున్నారు.