GDNaidu | భారతీయ సాంకేతిక, పారిశ్రామిక రంగానికి కొత్త దిశను నిర్దేశించిన మహోన్నత వ్యక్తి, ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’ మరియు ‘వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్’ గా ప్రపంచవ్యాప్తంగా కీర్తిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.నాయుడు) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జి.డి.ఎన్’ (GDN). ఎల్లప్పుడూ విభిన్నమైన కథలను, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ ఈ బయోపిక్‌లో ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ప్రతిభావంతుడైన నటుడు మరియు దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
జి.డి. నాయుడు అసాధారణ ప్రజ్ఞను, ఆయన పడిన కష్టాలను, దేశం కోసం చేసిన అద్భుతమైన ఆవిష్కరణలను వెండితెరపై కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించే ఈ చిత్రంలో ఆర్. మాధవన్ జీవించేశారనే చెప్పాలి. గతంలో నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘రాకెట్రి’ చిత్రంలో అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మాధవన్, ఈ సినిమా కోసం పూర్తిగా మారిపోయారు. విభిన్నమైన గెటప్స్‌లో ఆయన కనిపించిన తీరు, సినిమా కోసం ఆయన పడిన తపన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాచురల్ పీరియాడికల్ సెటప్, అత్యున్నత నిర్మాణ విలువలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో మాధవన్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ మరియు వినయ్ రాయ్ వంటి దిగ్గజ నటులు నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ చిత్రానికి సంగీత సంచలనం గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశాన్ని ఆయన తన సంగీతంతో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లారు. ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్‌కు సినీ ప్రియుల నుంచి, విమర్శకుల నుంచి ఊహించని రీతిలో అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలోనూ ఈ ట్రైలర్ ట్రెండింగ్‌లో నిలిచి, ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల జాబితాలో ‘జి.డి.నాయుడు’ అగ్రస్థానంలో నిలిచేలా చేసింది.
భారతీయ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఒక మహానాయకుడి స్పూర్తిదాయక ప్రయాణాన్ని నేటితరానికి పరిచయం చేస్తూ రూపొందించిన ఈ బయోపిక్‌ను ఆగస్ట్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రై కలర్ పిక్చర్స్ మరియు మీడియామాక్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, ఆర్. మాధవన్, సరిత మాధవన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యుత్తమ నిర్మాణ విలువలతో నిర్మించారు. ఈ భారీ చిత్రానికి పీఆర్వోగా నాగేశ్వరరావు (SNR) వ్యవహరిస్తున్నారు.