‘కొండపొలం’ తర్వాత మరే తెలుగు చిత్రంలో నటించలేదు పంజాబీ భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రస్తుతం ఈ సొగసరి హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘ఛత్రీవాలి’ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రకుల్‌ప్రీత్‌సింగ్ సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాల్ని పంచుకుంది. ముఖ్యంగా సోషల్‌మీడియా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
సామాజిక మాధ్యమాల్ని తాను ఏ రోజూ సీరియస్‌గా తీసుకోలేదని పేర్కొంది. కేవలం అభిమానులకు తన సినిమాల సమాచారాన్ని చేరవేస్తూ, వ్యక్తిగత జీవితం తాలూకు కొన్ని విషయాల్ని షేర్ చేసుకునేందుకే సోషల్‌మీడియాను వినియోగిస్తానని స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘సోషల్‌మీడియాలో పాజిటివ్‌తో పాటు నెగెటివ్ అంశాలుంటాయి. అయితే వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను. అభిమానులు నా గురించి మరిన్ని కొత్త విషయాల్ని తెలుసుకునే వేదికగానే సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తా’ అని చెప్పింది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ పాన్ ఇండియా చిత్రం ‘ఇండియన్-2’లో కమల్‌హాసన్ సరసన నటిస్తున్నది. హిందీలో రెండు చిత్రాలను అంగీకరించింది.