The Kashmir Files | ఈ రోజుల్లో వందల కోట్ల బడ్జెట్.. స్టార్ హీరోల సినిమాలే వారం రోజుల కంటే ఎక్కువగా ఆడటం లేదు. ఎంత మంచి టాక్ వచ్చినా కూడా రెండోవారం అదే ఊపు కొనసాగించడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక చిన్న సినిమా మాత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తుంది. అదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టిస్తున్న చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. 90వ దశకంలో కాశ్మీర్ పండిట్స్ పై జరిగిన మారణహోమానికి దృశ్యరూపం ఈ సినిమా. అయితే ఇందులో అన్నీ నిజాలే ఉన్నాయి అని కొందరు అంటుంటే.. ఉన్నవన్ని అబద్ధాలే కేవలం డబ్బు కోసం చరిత్రను మార్చి తీశారు.. దానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోంది అంటూ మరికొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎవరేమన్నా కూడా సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది.
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలయ్యే ముందు కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయా అని అందరూ అనుకున్నారు. అందుకే కేవలం 610 థియేటర్స్‌లో మాత్రమే కాశ్మీర్ ఫైల్స్ విడుదల చేశారు. కానీ ఒక్కొక్క రోజు పెరుగుతున్న కొద్దీ ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి థియేటర్స్ సంఖ్య కూడా పెంచారు. రెండో వారం ఏకంగా 4 వేల థియేటర్స్ కు తన రేంజ్ పెంచుకుంది కాశ్మీర్ ఫైల్స్. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే స్టార్ హీరోల సినిమాలు కూడా దిగదుడుపే అన్నట్లు సునామీ సృష్టిస్తోంది ఈ సినిమా.
ఇప్పటి వరకు 14 రోజుల్లో 191 కోట్లు వసూలు చేసి.. 200 కోట్ల వైపు అడుగులు వేస్తోంది. విడుదలైన 14 వ రోజు కూడా 10 కోట్లకు పైగా వసూలు చేసింది కాశ్మీర్ ఫైల్స్. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ట్రిపుల్ ఆర్ విడుదలైన తర్వాత కూడా కాశ్మీర్ ఫైల్స్ దూకుడు తగ్గేలా కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్లో ఈ సినిమా నుంచి ట్రిపుల్ ఆర్ కు ప్రమాదం పొంచి ఉంది. ఏదేమైనా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సంచలన విజయం సాధించింది ది కాశ్మీర్ ఫైల్స్. దానికి తోడు పలు రాష్ట్రాలు ఈ సినిమాకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇచ్చాయి. దాంతో నిర్మాతలకు లాభాల పంట పడుతుంది.