ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్
సోనీ లివ్: స్ట్రీమింగ్ అవుతోంది.
తారాగణం: అమిత్ సియాల్, సాహిల్ వైద్, భగవతీ పెరుమాల్, గిరీశ్ వర్మ, అంజనా బాలాజీ, డానిష్ ఇక్బాల్, విద్యుత్ గార్గి, షఫీక్ ముస్తఫా తదితరులు, దర్శకత్వం: నగేష్ కుకునూర్
నిజజీవిత సంఘటనలెన్నో సినిమాలుగా వచ్చాయి. అభిమానులను అలరించాయి, ఆకట్టుకున్నాయి. కొన్నిమాత్రమే.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచాయి. అందుకే, యదార్థ గాథలను తెరకెక్కించడానికి సినీజనాలు ఉత్సుకత చూపుతుంటారు. వెబ్‌సిరీస్‌ల జమానా మొదలయ్యాక రియల్ స్టోరీస్‌కు మరింత డిమాండ్ పెరిగింది. రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో వచ్చిన ‘ది హంట్’ వెబ్‌సిరీస్ రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నది. యావత్ దేశాన్నీ కుదిపేసి.. దేశ రాజకీయాలు, భద్రత, చరిత్రను తిరగరాసిన సంఘటన ఇది.
ఈ దారుణానికి ఒడిగట్టింది శ్రీలంకకు చెందిన ‘ఎల్టీటీఈ సంస్థ’. అప్పటి సంగతులతో అనిరుధ్య మిత్ర అనే జర్నలిస్ట్, రచయిత ‘90 డేస్’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఆధారంగానే.. ‘ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ సిరీస్ తెరకెక్కింది. అందరికీ తెలిసిన సంగతులే అయినా.. ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. 1991 మే 21న తమిళనాడులోని పెరంబదూర్ గ్రామంలో ఓ బహిరంగ సభకు హాజరవుతారు రాజీవ్‌గాంధీ. అక్కడే మానవబాంబుతో ఆయన్ని హతమారుస్తారు. అది.. మనదేశంలో మొట్టమొదటి ఆత్మాహుతి దాడి. దాంతో ఈ కేసు.. దేశ భద్రతా దళానికి సవాలుగా మారుతుంది.
ఎట్టి పరిస్థితుల్లోనైనా.. దీని వెనుక ఉన్నదెవరో కనిపెట్టాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ని ఏర్పాటుచేస్తారు. దానికి హెడ్‌గా హైదరాబాద్‌కి చెందిన ప్రత్యేకాధికారి డా కార్తికేయన్ ఐజీపీ (అమిత్ సియాల్)ను నియమిస్తారు. ఇక్కడి నుంచి సిట్ సభ్యులు.. అమోద్ కాంత్ (డానిశ్ ఇక్బాల్), రాధా వినోద్ రాజు (గిరీష్ శర్మ), అమిత్ వర్మ (సాహిల్ వైద్)తో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. శ్రీలంకకు చెందిన ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం’ సంస్థ.. ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తిస్తారు. మరి.. మాజీ ప్రధానిగా ఉన్న రాజీవ్‌ను ఎల్టీటీఈ ఎందుకు చంపింది? ఈ మొత్తం ప్లాన్‌కు వెన్నెముక అయిన శివరాసన్ ఎవరు? సిట్ అధికారులు అతణ్ని పట్టుకున్నారా? నళిని, దాస్తోపాటు ఇతర నిందితులు ఎలా చిక్కారు? మొత్తం 90 రోజులపాటు సాగిన ఇన్వెస్టిగేషన్లో చివరికి ఎవరు గెలిచారు? అన్నదే ఈ సిరీస్.