సినిమా పేరు: ‘GOAT’ (The Greatest Of All Time)
తారాగణం: విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, ప్రేమ్‌జీ..
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
దర్శకుడు: వెంకట్‌ప్రభు
నిర్మాతలు: కల్పత్తి ఎస్ అఘోరం, కల్పత్తి ఎస్ గణేశ్, కల్పత్తి సురేశ్..
‘GOAT’ Movie | తమిళ స్టార్హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) సినిమా అంటే మామూలుగానే హైప్స్ ఓ రేంజ్లో ఉంటాయి. ‘గోట్'(Goat Movie) ఆయన రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత విడుదల అవుతున్న సినిమా. పైగా ఇదే విజయ్ ఆఖరు సినిమా అంటూ కూడా ప్రచారం జరిగింది. దాంతో ఈ సినిమాకు తమిళనాట అంచనాలు అవధులు దాటిపోయాయి. ఆ ప్రభావం మిగతా రాష్ర్టాల్లో కూడా అంతోఇంతో ఉండటం సహసజమే. వెంకట్‌ప్రభు(Venkat Prabhu) లాంటి క్రియేటర్ ఈ సినిమాకు దర్శకుడు కావడం, విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు రావడం ఇవన్నీ సాధారణ ప్రేక్షకుడికి సైతం సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. మరి ఇన్ని అంచనాలను ‘గోట్’ అందుకుందా? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ:
గాంధీ (విజయ్) నిజాయితీ పరుడు. ఇండియా తరఫున స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్‌లో అతనో రహస్య ఉద్యోగి. ఓ మిషన్‌పై కెన్యాలో తన మిత్రుడితో కలిసి చేసిన ఓ ఆపరేషన్‌లో పేరు మోసిన మాఫియా డాన్ మీనన్(మైక్ మోహన్)ని అనుకోకుండా చంపేస్తాడు. ఆ తర్వాత మరో మిషన్ మీద తన భార్య అను(స్నేహ), తన కుమారుడు జీవన్‌తో కలిసి మరో దేశానికి వెళ్తాడు. అక్కడ ఊహించని పరిణామాలు గాంధీకి ఎదురువుతాయ్. కొన్ని పరిస్థితుల కారణంగా గాంధీకి కొడుకు జీవన్ దూరమవుతాడు. దూరమైన జీవన్ ఏమయ్యాడు? ఎలా పెరిగాడు? తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం మిగతా కథ.
విశ్లేషణ:
ఇది పూర్తిగా విజయ్ మార్క్ సినిమా. ఒక్కడే భుజాలపై సినిమాను మోశాడనాలి. అతని పాత్రలే ఈ సినిమా హైలైట్. ఇంతకు ముందు చూడని కొత్త విజయ్‌ని ఈ సినిమాలో చూస్తారు. ఓ విధంగా తన నటనతో సర్ప్రైజ్ చేశాడు విజయ్. ముఖ్యంగా ఆ నెగిటివ్ షేడ్‌లో అయితే అదరగొట్టేశాడు. అయితే.. సినిమా నిడివి పెద్దది కావడంతో ల్యాగ్ ఎక్కువగా అనిపిస్తుంది. హాలీవుడ్ సినిమా ‘జెమినీ మ్యాన్’ని కాపీ చేసి దర్శకుడు వెంకట్‌ప్రభు ఈ సినిమా తీశాడంటూ గతంలో వార్తలొచ్చాయి. దానికి తగ్గట్టే కొన్ని సీన్స్ మక్కీకి మక్కీ దించేశాడు. ‘జెమినీ మ్యాన్’ చూసిన వాళ్లు ఈ సినిమా చూస్తే కచ్చితంగా అసంతృప్తికి లోనవుతారు. చూడని వాళ్లకు నచ్చే అవకాశం ఉంది. అలాగే లాజిక్ లేకుండా సిల్లీగా కొన్ని యాక్షన్ సీన్స్ తీసి, ఆడియన్స్‌ని ఇరిటేట్ చేశాడు వెంకట్ ప్రభు. బలహీనమైన కథ, కథనాలు, సినిమా చూస్తున్నంతసేపూ గతంలో చూసిన కొన్ని సినిమాల సీన్లు గుర్తుకురావడం.. ఈ సినిమాకు పెద్ద మైనస్. అయితే.. అక్కడక్క హై మూమెంట్స్, పతాక సన్నివేశాల్లో చెన్నయ్, ముంబై మ్యాచ్ కామెంట్రీతో విజయ్ రోల్‌ని హైలైట్ చేయడం.. ఇవన్నీ అభిమానుల్లో గూజ్బమ్స్ తెప్పిస్తాయి.
నటీనటులు
ఇక విజయ్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కథ, కథనాలు ఎలాగున్నా.. విజయ్ మాత్రం తన నటనతో సినిమాను మరోస్థాయిలో నిలబెటట్టాడు. పొంతన లేని రెండు పాత్రల్లో అద్భుతంగా నటించాడు. అలాగే స్నేహ డీసెంట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. మీనాక్షి చౌదరి అందాల ఆరబోతకే పరిమితం అయ్యింది. ప్రభుదేవా, జయం రవి, ప్రశాంత్ పరిథిమేర తన పాత్రలను రక్తికట్టించారు. త్రిష, శివకార్తీకేయన్ల సెడన్ ఎంట్రీ ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేశాయి.
సాంకేతికంగా:
వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా వీక్‌గా అనిపించింది. యువన్ సాంగ్స్ యావరేజ్‌గా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం చాలా బావుంది. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఇక ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వెంకట్ ప్రభు గురించి. అక్కడక్కడ ఫ్యాన్స్‌కోసం కొన్ని మసాలా ఐటమ్స్ జోడించాడు తప్ప, కథ, కథనాల్లో ఏ మాత్రం కొత్తదనం లేదు. ఓ విధంగా వెంకట్‌ప్రభు వీక్ వర్క్ ఈ సినిమా. మొత్తంగా సినిమా గురించి చెప్పొచ్చేదేంటంటే.. సగటు ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా లేదు. అయితే.. విజయ్ అభిమానులు మాత్రం ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. మరి అభిమానులు మాత్రమే చూస్తే సినిమా నిలబడుతుదా? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
ప్లస్ పాయింట్స్
విజయ్ నటన, నేపథ్య సంగీతం, కొన్ని సన్నివేశాలు..
మైనస్ పాయింట్స్
కథ, కథనం, పాటలు..
రేటింగ్
2.5/5