PreWeddingShow | చిన్న బడ్జెట్ చిత్రంగా విడుదలై, మౌత్ టాక్‌తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటున్న సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. వర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ చిత్రం.. నార్త్ అమెరికాలో $100K డాలర్ల వసూళ్లతో మైల్స్టోన్ విజయాన్ని సాధించింది. నవంబర్ 7న విడుదలైన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సందీప్ అగరం, అష్మిత రెడ్డి (7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై) ఈ చిత్రాన్ని నిర్మించారు. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో విడుదల చేశారు. వారి ప్లానింగ్, రీచ్ కారణంగానే ఈ సినిమా అమెరికా, కెనడా ప్రేక్షకులకు చేరువ కాగలిగింది. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా, కేవలం మౌత్ టాక్‌ను నమ్ముకుని నార్త్ అమెరికాలో $100K డాలర్ల వసూళ్లను సాధించడం అరుదైన విజయంగా సినీ విశ్లేషకులు అభివర్ణించారు.
ఈ చిత్రం కథాంశం చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒక చిన్న పట్టణంలో ఉండే రమేష్ అనే ఫొటోగ్రాఫర్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసినప్పుడు మెమొరీ కార్డుని కోల్పోవటం వల్ల ఏర్పడే గందరగోళమైన పరిస్థితుల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు కథనంలో కామెడీ, ఆప్యాయత వంటి అంశాలను అతిశయోక్తి లేకుండా, మన చుట్టూ ఉన్న ప్రజలకు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, వారి ప్రవర్తన, వారి జీవితాల్లోని డ్రామా, కామెడీ మరియు భావోద్వేగాలను సహజంగా చూపించారు. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్, భారీతనం లేకపోయినా.. నిజాయితీ మరియు నైపుణ్యంతో కూడిన మంచి కథ ఉంటే చాలు అని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ప్రస్తుతం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఓవర్సీస్లో విజయవంతంగా రన్ అవుతూ మంచి వసూళ్లను సాధిస్తోంది.