మహాకవి డాక్టర్ సినారె పుట్టి పెరిగింది అచ్చమైన తెలంగాణ పల్లె హనుమాజిపేటలో. తనకు ఊహ తెలిసిన నాటి నుంచి అమ్మ బుచ్చవ్వ దొరసాని పాట, జానపదుల ఆట ఆయన మనసులో చెరగని ముద్రను, చెదరని స్ఫూర్తిని కలిగించాయి. పల్లె నుంచి పట్నం దాకా సాగిన ప్రయాణంలో ఆయన వెన్నంటే సాగాయి. అవకాశం వచ్చిన ప్రతిసారీ తన పాటల్లో తెలంగాణ సంస్కృతిని పల్లవింపజేసేవారు ఆయన. ‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది’ అన్న ఆయనే.. తెలంగాణ ఆవశ్యకతను తెలియజేస్తూ.. ‘తెలుగు జాతి మనది… రెండుగ వెలుగు జాతి మనది’ అని తన మనసులోమాటను వెలిబుచ్చారు. ఎన్నో పండుగలకు, మరెన్నో సందర్భాలకు అందమైన పాటలు రాసిన ఆయన.. మన తెలంగాణ పండుగ బతుకమ్మ గురించీ అద్భుతమైన పాటలు రాశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత కొంత అనివార్యత, మరికొంత తప్పని పరిస్థితుల్లో ఇవాళ ‘బతుకమ్మ’ వెండి తెరమీద వెలుగుతున్నది. కానీ తెలంగాణ పదం పలకడమే ఇబ్బందిగా ఉన్న డెబ్బెయ్యో దశకంలో ఏకంగా బతుకమ్మ నేపథ్యంగానే ఓ పాటను పెట్టడం.. అదీ ఎన్టీయార్, శారద, వాణిశ్రీ తారాగణంగా సీఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన సినిమాలో పెట్టడం మామూలు ముచ్చటకాదు. అది సినారెకే చెల్లింది.
1971 మార్చి 31న విడుదలైంది ‘జీవిత చక్రం’. ఇందులో సినారె పాటలున్నాయి. ఇద్దరు నాయికల్లో ఒకరైన ఊర్వశి శారదపై ఈ ‘బతుకమ్మ పాటను చిత్రీకరించారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో’ అంటూ గ్రామీణ నేపథ్యంలో నాయిక తన బావను తలుచుకొని పాడే నేపథ్యంలో వస్తుందీ గీతం. ఈ పాటకు శారదను ఎంచుకోవడమే దర్శకుడి ఔన్నత్యానికి నిదర్శనం. అచ్చమైన తెలంగాణ ‘పల్లె పడచు’లాగా శారద ఇందులో కనిపించడం విశేషం.
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…
బంగారు గౌరమ్మ ఉయ్యాలో…
పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో…
పాలించవే తల్లి ఉయ్యాలో…
నా నోము పండింది ఉయ్యాలో…
నీ నోము పండింద ఉయ్యాలో..
మా వారు వచ్చిరి ఉయ్యాలో..
మీ వారు వచ్చిరా ఉయ్యాలో.. ॥2॥
ఊరంత ఈరోజు బతుకమ్మ పండుగ
నా బావ వస్తే.. వస్తే..
నా బతుకంతా పండుగా….
బావ నీ బావా వస్తాడు ఆగవే భామా
అవునా అతడౌనా అందాల చందమామ ॥2॥
బావ నా బావా వస్తాడు ఆగవే భామా
అవునె అతడౌనె అందాల చందమామ
మా బావ నవ్వితే మరు మల్లెలెందుకే
మా బావ తాకితే సిరివెన్నెలలెందుకే
నింగిని దిగి వస్తాడే.. ముంగిట అగుపిస్తాడే
ఒక్కసారి చూశారా సొక్కి సోలిపోతారే
ముత్యాల పందిరి.. వేయించమందువా
మేఘాల పల్లకీ.. తెప్పించమందువా
వంటరిగా వస్తాడే జంటగ కొనిపోతాడే
ఊరిని మరిపిస్తాడే నీ వారిని మరిపిస్తాడే
బతుకమ్మ పండుగకు ఆడబిడ్డ ఇంటికి రావడం తెలంగాణలో ఆనవాయితీ. అయితే విదేశాల నుంచి వచ్చిన తన బావ కోసం నాయిక కలువరిస్తూ ఈ పాటలో కనిపిస్తుంది. ఆరోజు ఊరంతా బతుకమ్మ పండుగైతే.. తనకేమో తన బావొస్తేనే ‘బతుకమ్మ పండుగ’ అవుతుందంటుంది నాయిక. ఆమెను ఆటపట్టిస్తూ స్నేహితులు ‘నీ బావ వస్తాడా? వచ్చినా అతడేమన్నా చంద్రుడా’ అంటే వెంటనే నాయిక ‘అవునె అతడౌనె/ అందాల చందమామ’అని చెబుతుంది. కవి సినారె ఆ బావ గురించి, అతని గురించిన నాయిక ఊహల గురించి ఎంత అందంగా చెబుతారో ఈ పంక్తుల్లో చూడొచ్చు.
‘మా బావ నచ్చితే మరుమల్లెలెందుకే.. మా బావ తాకితే సిరివెన్నెలలెందుకే’ పంక్తులు ఎంత ముచ్చటగా ఉంటాయో! సాధారణంగా నాయకుడు తన ప్రేయసి గురించి ఇలా చెప్పడం చూస్తాం. ఇక్కడ నాయిక తన నాయకున్ని గురించి చెబుతుంది. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక కేతనం! జీవన విధానానికి మూలధారలైన ఈ పండుగను నలుపు తెలుపుల కాలంలోనే రంగులపూల పాట బతుకమ్మగా ఆవిష్కరించారు సినారె. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం శంకర్-జైకిషన్ స్వరాలు అందించడం మరో విశేషం!
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…
బంగారు గౌరమ్మ ఉయ్యాలో…
పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో…
పాలించవే తల్లి ఉయ్యాలో…
– పత్తిపాక మోహన్