70th National Film Awards | 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శనివారం కేంద్రం ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలు గాను ఈ అవార్డులను ఎంపిక చేశారు. జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ చిత్రం ‘అట్టం’ ఎంపికకాగా, జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం కన్నడ ‘కాంతార’ సినిమాలో అద్భుతమైన నటన కనపరచిన రిషబ్ శెట్టిని వరించింది. ఇక జాతీయ ఉత్తమనటి పురస్కారానికి తమిళ చిత్రం ‘తిరుచిట్రంబళం’ చిత్రానికి గాను నిత్యామీనన్, గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రానికి గాను మానసి పరేఖ్లను సంయుక్తంగా ఎంపిక చేశారు.
తెలుగు సినిమా ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయచిత్రంగా ఎంపిక కావడం విశేషం. ఈసారి మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రానికి సాంకేతిక విభాగాల్లో అవార్డుల పంట పండించింది. ఈ సినిమాకు నాలుగు అవార్డులు వరించాయి. ‘ఉంచాయి’ చిత్రానికిగాను సీనియర్ దర్శకుడు సూరజ్ భర్జత్యా ఉత్తమ దర్శకుడిగా పురస్కారానికి ఎంపికయ్యారు.
మలయాళ సినిమా రివార్డులు ఏ స్థాయిలో దక్కించుకున్నా.. అవార్డులు మాత్రం తప్పకుండా జాతీయ స్థాయిలో గెలుస్తూనే ఉంది. యేటేటా ప్రకటించే జాతీయ పురస్కారాల్లో మలయాళ చిత్రాలు లేకపోవడం చాలా అరుదైన విషయం. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మలయాళ సినిమా జాతీయ పురస్కారాల్లో సత్తా చాటింది. ఆ సినిమానే ‘ఆట్టం’. నిజానికి ఈ సినిమాలో తెలిసిన నటీనటులెవరూ లేరు. అందరూ కొత్త వాళ్లతో చేసిన ఈ సినిమా ఇంతటి ఘనత సాధించడానికి కారణం కేవలం కాన్సెప్ట్.
ఓ చిన్న ఊరిలో ఎవరికి తోచిన పని వారు చేసుకుంటూ.. తీరిక దొరికినప్పుడల్లా ఓ బృందంగా వివిధ వేదికల్లో నాటకాలు ప్రదర్శిస్తూ ఉండే ఓ 12మంది కళాకారుల కథ ఇది. వారిలో 11మంది మగవారైతే, ఒక్కరే స్త్రీ. ఆమె పేరు అంజలి. వీరిలో హరి అనే నటుడు సినిమాల్లో కూడా నటించి ఉండటంతో అతనికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. దాంతో మిగతా వారు జెలసీగా ఫీలవుతుంటారు. ఓ రోజు వారు ప్రదర్శన తిలకించి ముగ్ధులైన విదేశీ జంట.. ఆ బృందం మొత్తానికి తమ రిసార్ట్‌లో పార్టీ ఏర్పాటు చేస్తుంది.
ఆ పార్టీలో అందరూ మద్యం మత్తులో మునిగి తేలుతారు. కొంత సేపటికి ఎవరికి కేటాయించిన గదుల్లో వాళ్లు వెళ్లిపోతారు. అయితే.. అంజలి మాత్రం తన రూమ్‌లో కిటికి దగ్గరకెళ్లి అక్కడే కూర్చుని నిద్రపోతుంది. అర్ధరాత్రి వేళ ఓ వ్యక్తి అంజలి నిద్ర పోతున్న కిటికీ వద్దకు వచ్చి, కిటికీలో చేయి పెట్టి అంజలితో అసభ్యకరంగా ప్రవర్తించి, ముఖం చూపించకుండా పారిపోతాడు. ఆ వ్యక్తి వారి బృందంలోని వ్యక్తే అని తెలుస్తుంది. ఆ 11మందిలో ఆ వ్యక్తి ఎవరు? అతడ్ని ఎలా గుర్తించారు? అనేది మిగతా కథ.
వ్యక్తుల మనస్తత్వాలకు అద్దం పట్టేలా దర్శకుడు ఆనంద్ ఇకర్షి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒకే మనిషిలో ఉండే భిన్న వ్యక్తిత్వాలు ఇందులో ఆయన ఆవిష్కరించారు. మంచిగా కనిపించే మేకవన్నె పులులు, సందర్భాన్ని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లులు, తమ మనుగడ కోసం సాటివారిని బలిపశువుల్ని చేసే గుంటనక్కలు.. ఇలా చాలామంది ఈ సినిమాలో కనిపిస్తారు.
ఇందులో పాత్రలన్నీ నిత్యం సమాజంలో మనకు తారసపడేవే. సగటు మానవ స్వభావం ఇలా ఉంటుందని ఆనంద్ ఇకర్షి చూపించిన తీరు ఈ సినిమాకు జాతీయ పురస్కారాన్ని కట్టబెట్టింది. కథకు తగ్గట్టుగా పాత్రధారులు కూడా ఇందులో ఇమిడిపోయి నటించారు. అందరూ జీవించారనే చెప్పాలి. 1954లో వచ్చిన ‘12 యాంగ్రీమెన్’ హాలీవుడ్ టెలివిజన్ కార్యక్రమం ఆధారంగా దర్శకుడు ఆనంద్ ఇకర్షి ఈ సినిమాను తెరకెక్కించారు.
‘తిరుచిట్రంబళం’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది నిత్యామీనన్. ఉత్తమనటిగా ఆమె అందుకున్న తొలి నేషనల్ అవార్డు ఇదే కావడం గమనార్హం. ‘తిరుచిట్రంబళం’ చిత్రానికి మిథరన్ ఆర్.జవహర్ దర్శకుడు. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా నిత్యమీనన్ ‘శోభన’ అనే అద్భుతమైన పాత్ర పోషించింది.
తిరు(ధనుష్), శోభన(నిత్య) ఇద్దరు చిన్నప్పట్నుంచి కలిసి పెరుగుతారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. తిరుకి ఎలాగైనా ప్రేమ వివాహం చేసుకోవాలనే కోరిక. అందుకోసం నచ్చిన ప్రతి అమ్మాయికీ ట్రై చేస్తుంటాడు. దానికి శోభన హెల్ప్ చేస్తుంటుంది. కానీ ప్రతి అమ్మాయి దగ్గరా తిరుకు చేదు అనుభవాలే ఎదురువుతూవుంటాయి. తిరు అవస్త చూసి శోభన కూడా చాలా బాధ పడుతూ ఉంటుంది. మరోవైపు తెలీకుండానే తిరును శోభన ఇష్టపడుతూవుంటుంది. కానీ తనను తిరు అలా చూడటం లేదు కాబట్టి, తన మనసులోనే ఆ ఇష్టాన్ని దాచుకుంటుంది తప్ప వ్యక్తీకరించదు. అయితే.. తిరు తాతయ్య మాత్రం వీరిద్దరి బంధంపై ఓ అభిప్రాయానికి వస్తాడు.
‘నువ్వు చంకలో పిల్లాడ్ని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నావ్.. అసలు శోభనను ఎందుకు ట్రై చేయకూడదు?’ అని తిరుకి చిన్నసైజు కౌన్సిలింగ్ ఇస్తాడు తాతయ్య. దాంతో శోభనను ట్రై చేయడం మొదలుపెడతాడు తిరు. ఉన్నట్టుండి మారిన తిరు ప్రవర్తన చూసి శోభన షాక్ అవుతుంది. తనముందే అంతమంది అమ్మాయిలను ట్రై చేసిన తిరు ప్రేమను ఎలా నమ్మాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలీక శోభన సతమతమవుతుంది. చివరికి వీరి ప్రేమ ఎలా ఫలించింది? అనేది మిగతా కథ.
ఈ సినిమాలో ధనుష్, నిత్యామీనన్ పోటీ పడి నటించారు. అటు స్నేహితురాలిగా, ఇటు ప్రేమికురాలిగా నిత్యా నటన స్కై లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా పతాక సన్నివేశంలో నిత్యామీనన్ అభినయం ఈ సినిమాకే హైలైట్. ఓ మధ్య తరగతి అమ్మాయిగా, ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న విద్యావంతురాలిగా వివిధ కోణాల్లో నిత్యామీనన్ కనిపిస్తుంది. వినోదం, విషాదం, ప్రేమ.. ఇలా ఎన్నో ఉద్వేగాలున్న పాత్ర ఆమెది. స్వతహాగా మంచి నటి కావడంతో అద్భుతంగా నిత్యామీనన్ నటించింది. ఆ నటనకు సరైన పురస్కారం నేడు లభించింది.
నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ-2’ చిత్రం 70వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. విజయవంతమైన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ ఇది. గత ఏడాది ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రతి ప్రశ్నకు ఓ సమాధానం ఉంటుందని, దానిని అన్వేషించడానికి ఎంతదూరమైన వెళ్లాలనే బలమైన సంకల్పం ఉన్న యువకుడు కార్తికేయ చేసిన సాహసభరితమైన ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. శ్రీకృష్ణుడి చరిత్ర చుట్టూ ద్వారక నేపథ్యంలో అల్లుకున్న ఈ కథ ఆద్యంతం ఆధ్యాత్మికత, థ్రిల్లింగ్ అంశాల కలబోతగా సాగుతుంది. ద్వారకా నేపథ్యంతో పాటు శ్రీకృష్ణుడి తత్వాన్ని చర్చించడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది.
సీనియర్ దర్శకుడు సూరజ్ బర్జాత్య తెరకెక్కించిన ‘ఉంచాయి’ చిత్రం నలుగురు స్నేహితుల భావోద్వేగభరిత కథగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికిగాను సూరజ్ బర్జాత్య ఉత్తమ దర్శకుడిగా పురస్కారానికి ఎంపికయ్యారు. అమితాబ్ బచ్చన్, డానీ డెంజొప్పా, అనుపమ్‌ఖేర్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలను పోషించారు. తన స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి అతడి చితాభస్మంని తీసుకొని హిమాలయాలకు వెళ్లిన స్నేహితుల కథతో ఆద్యంతం హృదయాన్ని స్పృశించింది.
‘కార్తికేయ 2’ సినిమా విడుదలై అద్భుతమైన విజయం సాధించినప్పుడు ఒక దర్శకుడిగా ఎంత ఆనందపడ్డానో, మళ్లీ ఇప్పుడు అంత ఆనందపడుతున్నా. ఈ అవార్డు నా బాధ్యత మరింత పెంచింది. ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ‘కార్తికేయ 3’ ప్రస్తుతం రైటింగ్‌లో ఉంది. అందరి అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుంది.. జై శ్రీకృష్ణ..- దర్శకుడు చందూ మొండేటి
కన్నడనాటి దర్శకుడిగా, నటుడిగా బహుముఖప్రజ్ఞతో రాణిస్తున్నారు రిషబ్‌శెట్టి. ఆయన అసలు పేరు ప్రశాంత్శెట్టి. దక్షిణ కర్ణాటక మంగళూరు దగ్గరలోని కెరాడి అనే గ్రామంలో 1983లో జన్మించారు. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో ‘రంగసౌరభం’ అనే నాటక బృందంలో నాటకాలు వేసేవారు. కుందాపురలో పాఠశాల రోజుల్లోనే నటనపై మక్కువతో యక్షగాన నేపథ్య నాటికల్లో నటించారు రిషబ్‌శెట్టి. కర్ణాటక ప్రభుత్వం ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ నుంచి డైరెక్షన్లో డిప్లొమా పూర్తి చేసిన అనంతరం సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలుత క్లాప్బాయ్, లైట్‌బాయ్, టచప్ మ్యాన్‌గా పనిచేసిన అనంతరం సహాయ దర్శకుడిగా మారారు.
సినిమాల్లోకి రాకముందు జీవనం కోసం మినరల్ వాటర్, రియల్ఎస్టేట్, హోటల్ వ్యాపారాలు చేసి నష్టాలు చవిచూశారు. ‘తుగ్లక్’ (2012) చిత్రం ప్రతినాయక పాత్ర ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టారు. ‘రికీ’ (2016) చిత్రంతో దర్శకుడిగా మారారు. నటుడిగా బెల్‌బాటమ్, గరుడ గమన వృషభ వాహన, హాస్టల్ హుడుగురు బేకద్దిరే వంటి చిత్రాలు వంటి చిత్రాలు మంచి గుర్తింపునిచ్చాయి. ఇక ‘కాంతార’తో దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. కిరిక్‌పార్టీ, సర్కారి హిరియా ప్రాథమిక శాలే కాసరగోడు వంటి చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటారు.
స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి నటించిన ‘కాంతార’ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుత విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దైవిక అంశాలు, అడవి బిడ్డల అస్తిత్వ పోరాటం కలబోతగా ఈ చిత్రం అందరి మన్ననలు అందుకొంది. దక్షిణ కన్నడ ఆచార వ్యవహారాలు, ధార్మిక విశ్వాసాల నేపథ్యంలో ఈ సినిమా దేశవ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. దక్షిణ కన్నడ సంస్కృతిలో అనాదిగా భాగమైన భూతకోల ఆరాధన, పంజుర్లి దేవత నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ఈ సినిమాలో శివ పాత్రలో రిషన్శెట్టి అద్భుతాభినయాన్ని కనబరిచాడు. ఈ చిత్రం అన్ని భాషల్లో భారీ విజయం సాధించింది. నాలుగు వందల కోట్లకుపైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది.