‘కాన్సెప్ట్‌తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు చేస్తూ ముందుకెళ్లాలనేది నా అభిమతం. అందులో భాగంగానే నాలుగొందల కథలు విన్నాను. వాటిలో ఓ ఐదు కథల్ని సెలక్ట్ చేసుకున్నాను. నిజానికి ఆ ఐదు కథలు కూడా నాకు పూర్తిగా సంతృప్తినివ్వలేదు. ఏదైనా చేస్తే జనాల హృదయాల్లో నిలిచిపోవాలి. మహానటి, జర్నీ, సీతారామం సినిమాల్లా క్లాసిక్స్‌గా మిగిలిపోవాలి. అలాంటి కథ వెతుకుతున్న సమయంలో నాకు దొరికిన కథ ‘35-చిన్నకథ కాదు’. విశ్వనాథ్, బాపూ, కె.బాలచందర్ సినిమాలు చూసిన అనుభూతినిచ్చే సినిమా ఇది’ అని నిర్మాత సృజన్ యరబోలు అన్నారు. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధానపాత్రధారులుగా నందకిశోర్ ఈమని దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సిద్ధార్థ్ రాళ్లపల్లిలతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘35-చిన్నకథకాదు’. ఈ నెల 6న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘మదర్ సెంటిమెంట్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ కథ నాకంత నచ్చడానికి కారణం అదే. ఈ కథలో నివేద పాత్ర చూస్తే నాకు మా అమ్మ గుర్తొచ్చింది. ఈ కథ భావోద్వేగాల మేళవింపు. చూస్తున్న ప్రేక్షకుడు ఏదోఒక విషయంలో కనెక్ట్ అయిపోతాడు. చాలారోజుల తర్వాత పిల్లల కోసం ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌కి వెళ్లే సినిమా ఇది. తిరుపతి నేపథ్యం.. అక్కడి వాతావరణం, ఆ ఇల్లు, స్కూల్.. ఓ ఆహ్లాదకర ప్రపంచంలో ఉన్న అనుభూతినిచ్చే సినిమా ఇది’ అని తెలిపారు నిర్మాత సృజన్. నివేద తప్ప ఈ పాత్రలో మరొకర్ని ఊహించలేమనీ, తిరుపతి స్లాంగ్ చాలా కష్టపడి నేర్చుకొని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిందని, హీరో విశ్వదేవ్‌ని ఆడిషన్స్ చేసి తీసుకున్నామని, చాలా బాగా చేశాడని, అలాగే ప్రియదర్శి, భాగ్యరాజా, గౌతమి అందరూ తమ పాత్రల ద్వారా కథను రక్తికట్టించారని ఆయన తెలిపారు.