సోమవారం నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ నిలిపివేస్తామని ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటన చేశాయి. అయితే కొన్ని సినిమాల షూటింగ్స్ కొనసాగడంపై పరిశ్రమలో గందరగోళం ఏర్పడుతున్నది. తమకు నిర్మాతల మండలి నుంచి బంద్ గురించి ఎలాంటి నోటీస్ రాలేదని సినీ కార్మిక సంఘాలు అంటున్నాయి. నోటీస్ రాకపోవడం వల్లే షూటింగ్స్‌కు కార్మికులు హాజరవుతున్నట్లు వాళ్లు చెబుతున్నారు.
మరికొన్ని పెద్ద చిత్రాల షూటింగ్స్ జరుగుతుండటంపై చిన్న నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’, ధనుష్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సార్’ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాల షూటింగ్స్ యథావిధిగా జరుగుతున్నాయి.
ఇవి తమిళ, తెలుగు ద్విభాషా చిత్రాలు కాబట్టి తమిళ వెర్షన్ మాత్రమే షూటింగ్స్ చేస్తున్నామని, తెలుగు సినిమాలు ఏవీ చిత్రీకరణలు జరపడం లేదని సదరు నిర్మాతలు వివరణ ఇచ్చారు. ఇతర భాషల సినిమాల షూటింగ్స్ జరుపుకోవచ్చని తాము ముందే చెప్పామని వారు అంటున్నారు.