నమ్మిన సిద్ధాంతాలు, వాస్తవాల కోసం నిజాయితీగా పోరాడే తమిళ రెబెల్‌గా తన పాత్ర విభిన్నంగా ఉంటుందని అంటోంది సమంత. ఆమె నటించిన తొలి హిందీ వెబ్‌సిరీస్ ‘ఫ్యామిలీమాన్-2’ ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఇందులో ఉగ్రవాదిగా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో గ్లామర్ హంగులకు దూరంగా రియలిస్టిక్‌గా సమంత కనిపిస్తోంది. ఆమెపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు ఆసక్తిని పంచుతున్నాయి. తమిళనాడులో విధ్వంసాల్ని సృష్టించడానికి ఓ మహిళా తీవ్రవాది వేసే ప్రణాళికల్ని అడ్డుకోవడానికి మనోజ్ బాజ్‌పాయ్ బృందం చేసే ప్రయత్నాలతో రెండో సీజన్‌ను తెరకెక్కించారు. ట్రైలర్లో సమంత నటనకు, ఆమె కనిపించిన తీరుకు చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. తన పాత్ర గురించి సమంత మాట్లాడుతూ ‘ఇందులో రాజీ అనే తమిళ రెబెల్‌గా కనిపిస్తా. ఇలాంటి అరుదైన పాత్రతో హిందీలో అరంగేట్రం చేయబోతుండటం అదృష్టంగా భావిస్తున్నా. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాయకానాయికలతో పోలిస్తే విలన్ పాత్రల్లో ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నటించొచ్చు. నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి దొరికిన అవకాశంగా భావించి ఈ వెబ్‌సిరీస్ అంగీకరించా’ అని తెలిపింది. రాజ్, డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్ జూన్ 4న విడుదలకాబోతుంది. మనోజ్‌బాజ్‌పాయ్, ప్రియమణి కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.