Asha Bhosle | భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అద్భుత స్వర శకం ముగిసింది. ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూసింది. శనివారం సాయంత్రం తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె, పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆశా మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెకి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
ఆశా భోంస్లే సంగీత ప్రస్థానం
భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక ధ్రువతారగా వెలిగిన ఆశా భోంస్లే ప్రస్థానం అద్భుతంగా సాగింది. 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆమె, ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్ వారసురాలిగా చిన్నతనంలోనే సంగీత ఓనమాలు నేర్చుకున్నారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ భారమై తన 10వ ఏటనే (1943) ‘మాఝా బల్’ అనే మరాఠీ చిత్రం ద్వారా గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, 1948లో ‘చునరియా’ చిత్రంలోని “సావన్ ఆయా” పాటతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు.
సమకాలీన గాయనులందరిలోనూ ఆశా భోంస్లేది ఒక విలక్షణమైన శైలి. కేవలం మెలోడీలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆధునిక సంగీతానికి ఆమె గొంతు కొత్త ప్రాణం పోసింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్తో ఆమె చేసిన ప్రయోగాలు విప్లవాత్మకమైనవి. “దమ్ మారో దమ్”, “పియా తూ అబ్ తో ఆజా” వంటి సాంగ్స్‌తో ఆమె పాప్ ఐకాన్‌గా ఎదిగారు. అదే సమయంలో ‘ఉమ్రావ్ జాన్’ చిత్రంలో ఆమె పాడిన గజల్స్ విన్నవారు, ఈమె గొంతులో ఇంతటి శాస్త్రీయ పరిణతి ఉందా అని ఆశ్చర్యపోయారు. ఆ చిత్రానికి ఆమె తొలి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. 90ల కాలంలో ఏఆర్ రెహమాన్ సంగీతంలో ‘రంగీలా’ వంటి చిత్రాల్లో పాటలు పాడి, ఆ తరం కుర్రకారును సైతం ఉర్రూతలూగించారు.
ఆమె రికార్డుల విషయానికొస్తే.. 20కి పైగా భారతీయ మరియు విదేశీ భాషల్లో సుమారు 12,000కు పైగా పాటలు పాడి, అత్యధిక స్టూడియో రికార్డింగ్స్ చేసిన గాయనిగా 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. భారత ప్రభుత్వం ఆమెను 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో, 2008లో పద్మ విభూషణ్‌తో గౌరవించింది. తెలుగు సినీ రంగంలోను
ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. చంటిలో ఓ ప్రేమ, చందమామ సినిమాలోని నాలో ఊసులకు నాలో ఊహాలకు అనే పాటలతో తెలుగు ప్రేక్షకుల మనసును కూడా దోచుకుంది.