ఆస్కార్ గెలుచుకున్న భారతీయ డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ చిత్రంతో తమిళనాడు ముడుమలై ఫారెస్ట్ రిజర్వ్ ప్రాంతానికి చెందిన బొమ్మన్, బెల్లి దంపతులకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. వీరు చేరదీసిన అనాథ ఏనుగు పిల్లల కథాంశంతోనే ‘ది ఎలిఫెండ్ విష్పరర్స్’ డాక్యుమెంటరీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ దంపతులు మరోమారు మూగ జీవాల పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. తాజాగా ఓ అనాథ ఏనుగు పిల్లను దత్తత తీసుకొని జీవ కారుణ్యాన్ని చాటుకున్నారు. ఈ విషయాన్ని ఐఏఎస్ అధికారిణి సుప్రియ సాహు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆనాథ ఏనుగు పిల్లలకు బొమ్మన్ దంపతులు సపర్యలు చేస్తున్న వీడియోను షేర్ చేసింది.