ఓటీటీ: ఆహా, దర్శకత్వం: కృష్ణ, విడుదల తేదీ: ఏప్రిల్ 17 సుందర ‘రామ అయోధ్య’ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం, రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జనంలో ఆధ్యాత్మిక మూలాలను తట్టి లేపాయి. దీంతో కొత్త మందిరంతో పాటు రాముడికి సంబంధించిన మరిన్ని ప్రదేశాల విశేషాల మీద జనంలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బాలరాముడి ఆలయంతోపాటు నంది గ్రామం, మహారాజా ప్యాలెస్, భరతుడి తపోవనం, కనక భవన్, దశరథ్ మహల్, దశరథ మహారాజు సమాధి, మణి పర్వతం, భరత కూపం సహా అయోధ్యలోని పలు చారిత్రక ప్రదేశాలకు సంబంధించిన వివరాలతో ‘రామ అయోధ్య’ అనే డాక్యుమెంటరీని రూపొందించారు దర్శకుడు కృష్ణ.దీనికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న సత్యకాశీ భార్గవ కథ అందించారు.
శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీన ప్రముఖ ఓటీటీ ఆహాలో ఇది విడుదలైంది. అయోధ్య అంటే రామ మందిరం మాత్రమే కాదు, అక్కడ ఎన్నో చారిత్రక, పవిత్ర ప్రదేశాలు, ఆలయాలు ఉన్నాయి. అవన్నీ డాక్యుమెంటరీలో చక్కగా చూపించారు. శ్రీరాముడి ఆదర్శ జీవితాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించడం ఎలా అన్న అంశాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అయోధ్య రామమందిర నిర్మాణం విశిష్టతలు, సుందరమైన నిర్మాణ శైలి, దాని ప్రత్యేకతలను సవివరంగా చెప్పారు. రామభక్తులతోపాటు భారతీయులందరికీ నచ్చేలా తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ తప్పక చూడాల్సిందే!