ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీ వరుస పరాజయాలతో సతమతమైంది. బాక్సాఫీస్ రేసులో పెద్ద చిత్రాలు కూడా చతికిలపడ్డాయి. మరోవైపు దక్షిణాది చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వసూళ్లపరంగా రికార్డులు బ్రేక్ చేశాయి. ఈ నేపథ్యంలో హిందీ చిత్రసీమ పునర్వైభవానికి చాలా సమయం తీసుకుంటుందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై అగ్ర నటుడు కమల్‌హాసన్ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఓ ప్రైవేట్ వెబ్‌ఛానల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘నేను హిందీ సినిమాను ఎంతగానో గౌరవిస్తాను. ఇక్కడ ఎందరో స్ఫూర్తినిచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులున్నారు. సూర్యుడి గమనాన్ని బట్టి ఉత్తరాయణం, దక్షిణాయణం అని కాల విభజన చేస్తాం.
ఆ తీరుగానే ప్రస్తుతం దక్షిణాది సినిమా వెలిగిపోతున్నది. కొన్ని రోజులు వెళ్లాక హిందీ సినిమా తన వైభవాన్ని తిరిగి పొందుతుంది’ అని కమల్‌హాసన్ వ్యాఖ్యానించారు. అలాగే సినీ ఇండస్ట్రీలో రాణించాలనుకునే వాళ్లు తొలుత హిందీ, బెంగాలీ సినిమాలు చూసిన తర్వాతే హాలీవుడ్‌పై మక్కువ పెంచుకోవాలని కమల్‌హాసన్ సూచించారు.