The Bengal Files | ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది తాష్కెంట్ ఫైల్స్’ వంటి వివాదాస్పద చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ది బెంగాల్ ఫైల్స్ (The Bengal Files). ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్ డే ముందు బెంగాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలను బెంగాల్ ప్రభుత్వం అడ్డుకుంటుందని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆరోపించాడు. ఈ సందర్భంగా దీనిపై న్యాయపరమైన చర్యలకు తీసుకోబోతున్నట్లు వెల్లడించాడు.
మా సినిమా విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీనిపై మేం రిట్ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నాం. కొందరు ప్రభుత్వ ప్రతినిధులు థియేటర్ల యజమానులను బెదిరిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఈ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు హెచ్చరించినట్లు మాకు కొందరు చెప్పారు. సినిమాను విడుదల చేస్తే థియేటర్ను ధ్వంసం చేస్తే ఏం చేయాలి?’ అని థియేటర్ల యజమానులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కొందరు వ్యక్తులు వాళ్లను అంతగా బెదిరించడం వల్లనే వాళ్ళు భయపడుతున్నారు. అందుకే, మేం దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం అంటూ వివేక్ తెలిపాడు. పల్లవి జోషి సహనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, గోవింద్ నామ్దేవ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.