Usha Parinayam | హృదయాలను బరువెక్కించే ప్రేమకథలను తీయడంలో బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిన దర్శకుడు కె.విజయభాస్కర్. ఆయన గత చిత్రాలైన స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వునాకునచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి.. సినిమాలే అందుకు నిదర్శనాలు. కొంత విరామం తర్వాత మరో ఫీల్‌గుడ్ ప్రేమకథతో విజయభాస్కర్ రానున్నారు. సినిమా పేరు ‘ఉషాపరిణయం’. ‘లవ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఉపశీర్షిక. కె.విజయభాస్కర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్నాడు. తెలుగమ్మాయి తాన్వీ ఆకాంక్ష కథానాయిక.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను ఆదివారం విడుదల చేశారు. ‘ఆకాశానికి జాబిలి అందం.. భూగోళానికే నా చెలి అందం’ అంటూ సాగే ఈ గీతాన్ని అలరాజు సాహిత్యం అందించగా, ఆర్.ఆర్.ధ్రువన్ స్వరపరిచి ఆలపించారు. ప్రేమకు తానిచ్చే నిర్వచనం ఈ సినిమా అని, అన్ని ఉద్వేగాలూ కలగలిసిన ఈ సంగీతభరిత ప్రేమకథ.. ప్రేమికులకు విందుభోజనంలా ఉంటుందని విజయభాస్కర్ తెలిపారు. సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెలకిశోర్, ఆమని, సుధ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల.