‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి వరుసగా అవార్డులు వరిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రతిష్టాత్మక పురస్కారాల్ని కైవసం చేసుకొని భారతీయ సినిమా ఖ్యాతిని చాటింది. తాజాగా ప్రకటించిన ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ (హెచ్‌సీఏ) అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఏకంగా ఐదు అవార్డుల్ని గెలుచుకొని సంచలనం సృష్టించింది. హాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్‌సీఏ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం..బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో అవార్డుల్ని సొంత చేసుకొంది. హాలీవుడ్లో ప్రజాదరణ పొందిన పలు యాక్షన్ చిత్రాల్ని అధిగమించి ‘ఆర్ఆర్ఆర్’ ఈ పురస్కారాల్ని పొందడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ‘ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌లో కొన్నిసార్లు మాత్రమే డూప్స్‌ని ఉపయోగించాం. దాదాపు అన్ని సీన్స్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్వయంగా స్టంట్స్ చేశారు. సినిమా షూటింగ్ మొత్తం 320 రోజులు జరిగితే, అందులో ఎక్కువ రోజుల్ని పోరాట ఘట్టాల కోసమే కేటాయించాం. ఈ అవార్డులు రావడం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’ అన్నారు. ఈ అవార్డు తమపై మరింత బాధ్యత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ చిత్రాల్ని అందించేందుకు కృషి చేస్తామని రామ్‌చరణ్ ఆనందం వ్యక్తం చేశారు.