OTT | తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తూ ఓటీటీ వేదికగా “ది 100” సినిమా సంచలనం సృష్టిస్తోంది. జూలై 11న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ థ్రిల్లర్, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో నెంబర్ 1 ట్రెండింగ్ మూవిగా నిలిచింది. ఊహించలేని ట్విస్టులు, గమ్మత్తైన కథనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఈ సినిమా, ప్రేక్షకుల ఆదరణతో ఓటీటీలో దూసుకుపోతోంది.
కథలోకి వెళితే…ఒక యువతి, తన హ్యాకర్ ప్రియుడితో గొడవైన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం కథకు బేస్. ఇదే సమయంలో ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్ (నాయకుడు పాత్ర)కి హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంటున్న వరుస దోపిడీలు, హత్యల కేసులను దర్యాప్తు చేయమని బాధ్యత అప్పగిస్తారు. కథ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉత్కంఠ రేపుతుంది. విక్రాంత్ జీవితంలో ఆర్తి అనే యువతి ప్రవేశంతో కథ మలుపు తిరుగుతుంది. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో, ఆత్మహత్య వెనుక ఉన్న నిజాలు ఏంటో తెలుసుకోవాలంటే, సినిమాను చూడాల్సిందే.
ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం – దాని క్లైమాక్స్. థ్రిల్లర్ సినిమాల్లో చూసే ప్యాటర్న్స్‌కు భిన్నంగా, “ది 100” చివర్లో చూపించే ట్విస్ట్ ప్రేక్షకులకు ఒక గట్టి షాక్ ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ మిస్ అయితే అసలు సినిమా తలపెట్టిన ఉద్దేశమే మిస్సవుతుంది అన్నంతగా, ఆంతర్యాన్ని కలిగిస్తుంది. రాఘవ్ ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మిషా నాయర్, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలుపోషించారు. ది 100 విడుదలైన తొలిరోజు నుంచి నెమ్మదిగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అది అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీగా నిలవడం విశేషం. థ్రిల్లింగ్ జానర్‌ను ఆస్వాదించే వారికి ఇది తప్పక చూడవలసిన సినిమా అని చెప్పవచ్చు.